జయలలిత సంచలన నిర్ణయం: నమ్మిన బంటుకే పాలనా పగ్గాలు
చెన్నై: తమిళనాడులో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్య కారణంగా సుదీర్ఘకాలం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉండాల్సిన నేపథ్యంలో ఇప్పటివరకు జయలలిత నిర్వహించిన శాఖలన్నింటినీ ఆమెకు నమ్మిన బంటు, ఆర్థిక మంత్రి అయిన పన్నీర్ సెల్వంకు అప్పగించారు.
ఈ మేరకు రాజ్ భవన్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఇరవై రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమవుతుంది.

ఇందులో భాగంగా జయలలిత వద్ద ఉన్న కీలకమైన హోం శాఖతోపాటు రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రజా సంబంధాల శాఖలను పన్నీర్ సెల్వంకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పన్నీర్ సెల్వంకు అప్పగించాలనే నిర్ణయం కూడా అమ్మదేనని తెలుస్తోంది.
దీంతో పాటు రాజ్యాంగంలోని 166వ ఆర్టికల్ క్లాజ్ నెంబర్ -3 ను అనుసరిస్తూ ముఖ్యమంత్రి శాఖలను ఆర్థిక మంత్రికి అప్పగించడంతో పాటు కేబినేట్ సమావేశాలను నిర్వహించే బాధ్యతలను అప్పగిస్తున్నట్లు రాజ్ భవన్ ప్రకటనలో తెలిపింది. ఒకానొక దశలో డిప్యూటీ సీఎం లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని నియమిస్తారనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే మంగళవారం ఆర్ధికమంత్రి పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నట్లు రాజ్ భవన్ ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. జయలలిత ఆరోగ్యం మెరుగుపడే వరకు పన్నీర్ సెల్వం పాలనపరమైన నిర్ణయాలను తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications