cockroaches: బొద్దింకల కారణంగా గంటన్నర పాటు ఆగిన రైలు..
బొద్దింకల కారణంగా రైలు గంటన్నర పాటు ఆగింది. ఈ ఘటన శనివారం సాయంత్రం పూణే జంక్షన్ స్టేషన్ లో జరిగింది. పుణె డివిజన్‌కు చెందిన సీనియర్ రైల్వే అధికారులు ఈ ఘటనను ధృవీకరించారు. పన్వేల్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ B-1 ఏసీ కోచ్ లో భారీగా బొద్దింకలు కనిపించాయి. దీనిపై ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లాతూర్ డిపోకు చెందిన దత్తా గైక్వాడ్ ఆన్‌బోర్డ్ టిక్కెట్ చెకింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వెంటనే చర్యలు తీసుకోవాలని మెకానికల్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. రైలు రాత్రి 7.15 గంటలకు రైలు పూణె చేరుకుంది.వెం టనే సీనియర్ సెక్షన్ ఇంజనీర్/క్యారేజ్ & వ్యాగన్, క్లీనింగ్ సిబ్బంది కోచ్ లోకి వెళ్లారు. తాత్కలిక ఉపశమనం కోసం హిట్ స్ప్రే చేశారు. అయినా కొన్ని చోట్లు బొద్దింకలు కనిపించాయి. దీంతో ప్రయాణికులు కోచ్ మారాచాలని పట్టుబట్టారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) సిబ్బందితో సహా రైల్వే సిబ్బంది ప్రయాణికులను ఒప్పించే ప్రయత్నం చేశారు.

అయినా ప్రయాణికులు వినలేదు. కోచ్ మార్చే ప్రసక్తే లేదని రైల్వే అధికారులు తేల్చిచెప్పారు. ఇటు ప్రయాణికులు రైలు కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కుర్చున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో పాటు సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ఇద్దరు క్లీనింగ్ సిబ్బందితో సహా నలుగురు సిబ్బందిని రైలులో పంపించారు. దీంతో ప్రయాణికులు శాంతించడంతో గంటన్నర పాటు ఆగిన ట్రైన్ రాత్రి 8:43 గంటలకు కదిలింది.
రైలులోని AC త్రీ-టైర్ కోచ్‌లో ప్రయాణిస్తున్న లక్ష్మీనారాయణ శర్మ అనే ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రైలు నంబర్ 17613 (పన్వేల్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్). 3A (AC త్రీ-టైర్) కోచ్‌లో చాలా బొద్దింకలు ఉన్నాయని ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. "B1 కోచ్ నుండి ఫిర్యాదు అందింది. రైలు 7.25 గంటలకు షెడ్యూల్ చేశారు. కానీ అది పూణెకు ముందుగానే చేరుకుంది. రాగానే, అధికారులు, క్లీనింగ్ సిబ్బంది వెంటనే కోచ్ వద్దకు వెళ్లారు. వారు త్వరగా ఉపశమనం కోసం 'హిట్' స్ప్రే చేయడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే కొంతమంది ప్రయాణికులు కోచ్‌ను మార్చాలని డిమాండ్ చేశారు" అని పూణే రైల్వే డివిజన్‌కు చెందిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్,PRO (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) రాందాస్ భిసే చెప్పారు.
"రైలు ఆలస్యం కాకుండా తదుపరి స్టేషన్‌లో ఇతర తెగుళ్ల నియంత్రణ చర్యలు తీసుకుంటామని రైల్వే సిబ్బంది ప్రయాణికులను నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయాణికులు అంగీకరించలేదు. అందుకే, పెస్ట్ కంట్రోల్ కోసం కొంతమంది సిబ్బందిని నియమించారు. రైలు కుర్దువాడి స్టేషన్‌కు చేరుకునే వరకు ఈ ప్రక్రియ కొనసాగింది" అని అన్నారు. ఈ రైలు దక్షిణ మధ్య రైల్వేకు చెందినదని భిసే తెలిపారు. ఈ ఘటనపై అక్కడి అధికారులకు సమాచారం అందించమన్నారు. మన్మాడ్-ముంబై పంచవటి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు కోచ్‌ల నిర్వహణ సరిగా లేదని జనవరిలో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications