లోక్ సభలో రాజ్యాంగ చర్చ ప్రారంభం-కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన రాజ్ నాథ్..!
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో రెండు రోజుల పాటు జరిగే చర్చను ఇవాళ కేంద్రం ప్రారంభించింది. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ లోక్ సభలో రాజ్యాంగంపై చర్చ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటీష్ పాలనను అద్భుతంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రాజ్ నాథ్ ఆరోపించారు.
రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీలో భాగస్వామ్యులు కాని మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్ , వీర్ సావర్కర్ వంటి చాలా మంది రాజ్యాంగ రూపకల్పన కోసం గణనీయమైన కృషి చేశారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేసారు. మన రాజ్యాంగం ప్రగతిశీలమైనదని, ఇది అందరినీ కలుపుకొని పోయేదని తెలిపారు. ఇది పరివర్తనాత్మకమైనదని, అన్ని విధాలుగా సామరస్యం, సద్భావన, శ్రేయస్సు ఉన్న సమాజాన్ని నిర్మించడానికి మన రాజ్యాంగం ఓ బ్లూప్రింట్ ఇచ్చిందన్నారు. ఎక్కడ పుట్టామన్నది కాకుండా దేశం అన్నదే ముఖ్యమన్నారు.

మరోవైపు రాజ్యసభ లో రాజ్యాంగంపై చర్చ విపక్షాల నిరసనల కారణంగా మొదలుకాలేదు దీంతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మధ్యాహ్నాం 12.40 గంటలకు భేటీ అవుతున్నారు. ధన్ కర్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్న నేపథ్యంలో ఖర్గేతో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ఇవాళ, రేపు పార్లమెంట్ లో జరిగే రాజ్యాంగంపై చర్చకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్, బీజేపీ తమ సభ్యులకు వేర్వేరుగా విప్ లు జారీ చేసాయి.












Click it and Unblock the Notifications