Parliament Security Breach: ప్రధాన సూత్రధారి లలిత్ మోహన్ అరెస్ట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఢిల్లీ పోలీసులు ఆరో నిందితుడు, ప్రధాన సూత్రధారి లలిత్ ఝాను గురువారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు మనోరంజన్ డి, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం దేవిలను కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపిన తర్వాత.. లలిత్ అరెస్ట్ కావడం జరిగింది.
నిందితులను ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి హర్దీప్ కౌర్ ముందు హాజరుపరిచారు. వారిని 15 రోజుల పాటు కస్టడీలో విచారించాలని కోరారు. అయితే, కోర్టు నియమించిన డిఫెన్స్ న్యాయవాది ఆ అభ్యర్ధనను వ్యతిరేకించారు. కస్టోడియల్ విచారణకు రెండు లేదా మూడు రోజులు సరిపోతుందని వాదించారు.

కాగా, నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్‌లతో పాటు, ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద వారిపై అభియోగాలు మోపారు. ఈ వ్యవహారాన్ని 'పక్కా ప్రణాళికాబద్ధమైన దాడి'గా పేర్కొంటూ.. నిందితులపై వరుసగా ఉగ్రవాదం, ఉగ్రవాదానికి కుట్రకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ 16, 18లను జోడించినట్లు ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
పక్కా ప్రణాళికతోనే పార్లమెంట్‌లో దుశ్చర్య
నిందితులు పక్కా ప్రణాళిక, పరస్పర సమయంతోనే ఈ దాడి తరహా ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరికీ నాలుగేళ్లుగా పరిచయం ఉందని, కొద్ది రోజుల క్రితం రెక్కీ కూడా నిర్వహించారని పోలీసులు వర్గాలు తెలిపాయి. ఆరు నెలల క్రితమే ఈ దుశ్చర్యక ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి.
పార్లమెంటు(Parliament) సమావేశాలు జరుగుతున్న లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి ఎంపీలను భయాందోళనకు గురిచేసిన నిందితులు సాగర్ శర్మ, మనో రంజన్ లను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమోల్ శిండే, నీలంను పార్లమెంట్ భవనం వెలుపల అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, నిందితులు లోక్‌సభలోకి వెళ్లేందుకు అవసరమైన పాసులు మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి జారీ కావడంతో ఆయన కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, నిందితులకు పాస్ లు జారీ చేసిన ఎంపీపై సస్పెన్షన్ వేటు వేయాలంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. గురువారం ఈ విషయంపై పార్లమెంటులో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో 14 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications