జమిలి బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం: రెండేళ్లలో ఎన్నికలకు లైన్ క్లియర్..!!
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఈ ఎన్నికల ముసాయిదా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కోవింద్ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈ కమిటీలో మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, రాజ్యసభ మాజీ సభ్యుడు గులాంనబీ ఆజాద్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ ఇదివరకే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది కూడా. దీనిపై తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే ముసాయిదా బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభలో ప్రవేశ పెట్టబోతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో దీన్ని సభలో టేబుల్ చేయడానికి లైన్ క్లియర్ అయింది.
ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా అధికార, ప్రతిపక్ష సభ్యులతో కూడిన ఓ జేపీసీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ కమిటీ ఇచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలులోకి 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో పంచాయతీ మొదలుకుని, మున్సిపల్ కార్పొరేషన్ వరకు గల అన్ని స్థానిక సంస్థలకూ ఎన్నికలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు.
నిజానికి- ఇప్పుడు ఎన్నికైన లోక్‌సభ కాలపరిమితి 2029 వరకు కొనసాగాల్సి ఉంది. ఈ లోక్‌సభ పూర్తికాలం పాటు కొనసాగబోదంటూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. 2029 లోపే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమలు చేసి తీరుతామంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం దాదాపుగా ఖాయమైనట్టే.












Click it and Unblock the Notifications