పాట్నా పేలుళ్లు: భత్కల్ రైట్‌హ్యాండ్ అక్తర్ మాస్టర్ మైండ్

ఆదివారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హూంకార్ ర్యాలీకి ముందు పాట్నాలో మూడు గంటల వ్యవధిలో ఎనిమిది పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. దీనిని జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాఫ్తు చేస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, వందమందికి పైగా గాయపడ్డారు.
అదుపులోకి తీసుకున్న ఇంతియాజ్ అన్సారీని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. పేలుళ్ల వెనుక కుట్రదారుడు ఎవరో కనుక్కునే ప్రయత్నాలు చేశారు. పాట్నా మొదటి రెండు పేలుళ్ల జరిగిన సమయంలో అన్సారీ అక్కడ ఉన్నాడు. అతను మరికొన్ని బాంబులను పెట్టే ప్రయత్నం చేశాడు.
అయితే అంతలోనే పోలీసులు రావడంతో భయపడి పారిపోయే ప్రయత్నం చేశాడు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అన్సారీతో పాటు అక్తర్, ఖలీం వంటి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాట్నా రైల్వే స్టేషన్‌లో పేలిన ఘటనలో ఐన్యూల్ అనే వ్యక్తి గాయపడ్డాడు. మొదట ఇతనిని బాధితుడిగా భావించారు. అనంతరం పేలుళ్లలో ఇతను కూడా నిందితుడేనని అధికారులు గుర్తించారు.
పట్టుబడ్డ అన్సారీ తెలిపిన వివరాల ప్రకారం... పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ ఉంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ముజఫర్ నగర్ అల్లర్లకు ప్రతీకారంగా ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ కుట్రకు మాస్టర్ మైండ్ తహసీన్ అక్తర్. ఇతను ఇటీవలె అరెస్టైన యాసిన్ భత్కల్‌కు రైట్ హ్యాండ్ వంటి వాడు. అన్సారీని అక్తర్ అక్టోబర్ నెలలో కలిశాడు. పాట్నాలో పేలుళ్లు జరిపేందుకు పేలుడు పదార్థాలు ఇచ్చాడు.
కేంద్రం అప్రమత్తం
పాట్నా వరుస పేలుళ్ల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పండుగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో భద్రతను పెంచారు.
పారిపోయిన ఉగ్రవాదిని పట్టుకున్నారు
పారిపోయిన ఉగ్రవాది అఫ్జల్ ఉస్మాన్‌ను తిరిగి పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్, సూరత్ పేలుళ్లలో అరెస్టైన ఉస్మానీని పోయిన నెల పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. రద్దీగా ఉండటంతో అతను పోలీసుల నుండి తప్పించుకున్నాడు. అతడిని తిరిగి అరెస్టు చేసినట్లు యాంటీ టెర్రర్ స్క్వాడ్ తెలిపింది.












Click it and Unblock the Notifications