• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాటూరి రామయ్య : నాలుగుసార్లు ఎమ్మెల్యే.. కానీ, సెంటు స్థలం లేదు.. సొంత ఇల్లూ లేదు

By BBC News తెలుగు
|

పాటూరి రామయ్య

పాటూరి రామయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ ఆయనకు సెంటుస్థలం కూడా లేదు. సొంత ఇంటికి కాసింత జాగా కోసం ఆయన ఇప్పుడు ఎదురు చూస్తున్నారు.

ఆయన పదవిలో ఉన్నప్పుడు పలుమార్లు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇంటి స్థలాలను కేటాయించింది. తోటి ఎమ్మెల్యేలలో చాలామంది ఆ స్థలాలను తీసుకున్నా, పార్టీ నిర్ణయం మేరకు ఆయన తిరస్కరించారు. దీంతో ఆయనకిప్పుడు నివాస స్థలమంటూ లేకుండా పోయింది.

వేల ఎకరాల భూమిని పేదలకు పంచేందుకు పోరాడిన ఆయన ప్రస్తుతం ఇంటి కోసం జాగా లేక ఇబ్బంది పడుతున్నారు. తనను గెలిపించి ప్రజల మధ్య నివసించాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా ?

పుచ్చలపల్లి సుందరయ్య నమ్మిన ఆదర్శాలను పాటూరు రామయ్య జీవితాంతం పాటించారు

సుందరయ్య స్ఫూర్తితో రాజకీయాల్లోకి..

1941లో నెల్లూరు జిల్లా కావలి తాలూకా జమ్మలపాలెంలో ఒక దళిత కుటుంబంలో జన్మించారు పాటూరి రామయ్య. తండ్రి మరణం తర్వాత కాయాకష్టం చేసుకుంటూనే చదువులు పూర్తి చేశారు. హైస్కూల్ దశలోనే కమ్యూనిస్టు నాయకుల పరిచయంతో వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

డిటెన్షన్‌కు వ్యతిరేకంగా జరుగుతన్న పోరాటంలో భాగంగా కావలిలో జరిగిన బహిరంగ సభలో పుచ్చలపల్లి సుందరయ్యతో పాటూరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన అడుగు జాడల్లోనే తన ప్రయాణం సాగిందని రామయ్య అన్నారు.

కూలీల హక్కుల కోసం పుచ్చలపల్లి సుందరయ్య సాగించిన పోరాటం ఆయనలో స్ఫూర్తి నింపింది. ఆయన మార్గమే దేశానికి మేలు చేస్తుందని రామయ్య విశ్వసించారు.

''కమ్యూనిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పని చేశాను. కేంద్ర కమిటీకి సభ్యుడిగా కూడా ఉన్నాను. వ్యవసాయ కార్మిక సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా కూలీల సమస్యల మీద దేశమంతా తిరిగాను. చైనాలో రెండుసార్లు పర్యటించా. సుందరయ్య స్ఫూర్తితోనే సాధారణ జీవితానికి అలవాటుపడ్డాను’’ అని రామయ్య బీబీసీతో అన్నారు.

పాటూరి రామయ్య

పిల్లలు పుట్టకుండా ఆపరేషన్..

కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న సుందరయ్య, ఆయన భార్య లీల పిల్లలకు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలే తమ వారసులుగా భావించామని సుందరయ్య 'విప్లవపథంలో నా పయనం’ అనే పుస్తకంలో చెప్పారు.

జనం కోసం జీవించే వాళ్లకు ఆ కొంచెం స్వార్థం కూడా లేకుండా సర్వం జనం కోసమే అన్నట్టుగా సాగాలని తీసుకున్న నిర్ణయంగా సుందరయ్య అందులో వివరించారు. అదేబాటలో రామయ్య కూడా నడిచారు.

కావలి కాలేజీలో మెట్రిక్యులేషన్‌లో చేరిన ఆయనకు సుందరయ్య తమ్ముడు డాక్టర్ రామచంద్రారెడ్డితో మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమే కమ్యూనిస్టు పార్టీలో రామయ్యను క్రియాశీలకంగా మార్చింది.

పగలంతా కాలేజీ, రాత్రుళ్లు గ్రామాలకు వెళ్లి వ్యవసాయ కార్మికుల సమావేశాల్లో పాల్గొనేవారు. అదే సమయంలో మహాలక్ష్మమ్మతో రామయ్య వివాహం జరిగింది. పిల్లలు కనొద్దని పెళ్లి అయిన వెంటనే భార్యాభర్తలిద్దరం నిర్ణయం తీసుకున్నామని రామయ్య వెల్లడించారు.

ఉద్యమంలో భాగంగా రామయ్య కుటుంబం విజయవాడ, హైదరాబాద్‌వంటి ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకుంది. రామయ్య పూర్తిగా పార్టీ బాధ్యతల్లో ఉండేవారు.

ఆ సమయంలో మహాలక్ష్మమ్మ లీల, నాగలక్ష్మి అనే నిరుపేద ఆడపిల్లలను చేరదీసి పెద్ద చేశారు. వారిలో ఒకమ్మాయి హైదరాబాద్‌లో ఉంటుండగా, రామయ్య కూడా వారింట్లోనే ఉంటున్నారు.

పాటూరి రామయ్య

పత్రికా రంగంలోనూ.. పలు పుస్తకాల రచయితగానూ..

పెళ్లి తర్వాత పార్టీ ఆదేశాలతో జనశక్తి దినపత్రికలో పనిచేయడానికి విజయవాడ వచ్చారు. అక్క‌డ ఆయ‌న ప్రూఫ్ రీడ‌ర్‌గా పనిచేశారు. పత్రికలో పనిచేస్తూనే పుస్తకాలు అనువాదంతోపాటు కొన్ని పుస్తకాలు కూడా రాశారు.

వియత్నాం విప్లవ వీరుడు ఎన్‌గుయాన్ వాన్‌ ట్రాయ్ కథను రామయ్య తెలుగులోకి అనువదించారు. కమ్యూనిస్టు పార్టీలో చీలిక తర్వాత జనశక్తి పత్రిక ఎంఎల్ పార్టీ నాయకత్వంలోకి వెళ్లడంతో, రామయ్య ప్రజాశక్తి వారపత్రికకు మారారు. అక్కడ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తూనే, వ్యవసాయ కార్మికుల సమస్యలపైనా పోరాడారు.

1982లో సుందరయ్య ఆదేశాలతో పత్రికారంగాన్ని వీడి మళ్లీ ప్రత్యక్ష ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. వ్యవసాయ కార్మికుల కూలీ, భూమి సమస్యలు సహా అనేక అంశాలపై పోరాటాలకు నాయకత్వం వహించారు.

గిరిజన, దళిత ఉద్యమాల్లోనూ రామయ్య పాల్గొన్నారు. వేల ఎకరాల భూమి రామయ్య నేతృత్వంలోనే నిరుపేదలు సాధించిన అనుభవాలున్నాయి. అందులో చల్లపల్లి భూపోరాటం ఆఖరి దశలో ఉండగా, దానికి ఎమ్మెల్యేగా రామయ్య కృషి కూడా తోడ్పడడంతో 2,700 ఎకరాల భూమి పేదలకు దక్కింది.

'ఉద్యమం-జీవితం’ పేరుతో ఆయన తన జీవిత ప్రస్థానాన్ని పుస్త‌కంగా తీసుకు వ‌చ్చారు.

ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఆయన 'ప్రజాశక్తి’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విజయవాడ కేంద్రంగా ఆయన నాలుగేళ్లకు పైగా ఆ పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు.

వార్డు మెంబర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే వరకూ..

పాటూరి రామయ్య స్వగ్రామంలోనే వార్డు మెంబర్‌గా ఎన్నిక‌య్యారు. ఎస్ఎస్ఎల్‌సి ప‌రీక్షల్లో ఫెయిల్ అయిన కాలంలో ఆయన ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజయం సాధించారు.

తర్వాత 1985లో తొలిసారిగా కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పట్లో తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఎం అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.

నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు కూడా పాటూరి రామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉండేది. 1989, 1994, 2004 ఎన్నికల్లోనూ సీపీఎం అభ్యర్థిగా రామ‌య్య‌ విజయం సాధించారు.

2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో నిడుమోలు నియోజకవర్గం రద్దయ్యింది. వ‌య‌సు కూడా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో రామయ్య ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నారు.

నిరాడంబ‌ర వ్య‌క్తిత్వంతో రామ‌య్య అంద‌రినీ ఆక‌ట్టుకునేవారు. ముఖ్య‌మంత్రులు కూడా ఆయ‌న స‌ల‌హాలు, డిమాండ్‌లు విన‌డానికి ప్రాధాన్య‌మిచ్చేవారు. లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో నాటి ప్రభుత్వ తోడ్పాటు కూడా ఆయ‌న‌కు లభించింది.

''ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మంచి జరుగుతుందని మేమంతా ఆశించాం. కానీ గతంకన్నా దయనీయంగా మారింది. పేదరికం కూడా పెరిగింది. సామాన్యుడి కష్టాలు పెరిగాయి. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు. కానీ ప్రజలను నమ్ముకుని, వారి సమస్యల మీద పనిచేసేవారిని జనం ఆదరిస్తారు. వారికి గుర్తింపు వస్తుంది’’ అన్నారాయ‌న‌.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని కాదన్నారు పాటూరి

సొంత ఇల్లు వద్దని అప్పుడే అనుకున్నారు

నెల్లూరు నుంచి విజయవాడ వచ్చిన తర్వాత జనశక్తిలో పనిచేసినపుడు అద్దె ఇల్లు దొరకడం కష్టమవడంతో రామయ్య ఓ ఖాళీ స్థలంలో ఇంటిని నిర్మించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

స్నేహితుల సలహాతో ఒక ఖాళీ స్థలంలో తాటాకు పాక వేసుకోవాలనుకున్న తనను సుందరయ్య వారించారని పాటూరి తెలిపారు. ఒక పేదవాడికి దక్కాల్సిన స్థలం మన వాడకూదని సుందరయ్య అన్నార‌ట. దాంతో సొంత ఇల్లు వద్దని అప్పట్లోనే నిర్ణయించుకున్నాన‌ని రామ‌య్య వెల్ల‌డించారు.

''ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కూడా పార్టీ ఆదేశంతో వద్దనుకున్నా. ఇప్పుడు సొంత మనుషుల మధ్య ఉండాలని అనిపిస్తోంది. కానీ నాకంటూ సొంత స్థలం లేదు. పార్టీ బాధ్యతల్లోలేను కాబట్టి ప్రభుత్వం కొంత స్థలం ఇస్తే తీసుకోవడానికి అభ్యంతరం లేదు’’ అని అన్నారాయ‌న‌.

ప్రభుత్వం స్థలం ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రామయ్య అంటున్నారు

మేలు పొందిన వారి స‌హ‌కారం

పాటూరి రామయ్య ఎమ్మెల్యేగానూ, కమ్యూనిస్టు నాయకుడిగానూ పలు కుటుంబాలకు సహాయం చేసినవారు కావడంతో ఆయ‌న‌కు నేటికీ అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కుమార్తె ఇంటి నుంచి వైద్యం, ఇతర అవసరాలరీత్యా ఎప్పుడు విజయవాడ వచ్చినా తిరువూరుకు చెందిన న్యూటన్ అనే ప్రైవేటు ఉద్యోగి ఒకరు ఆయ‌న‌కు సహాయంగా ఉంటున్నారు.

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు, శ‌రీరం సహకరించినంత కాలం ఆయ‌న ఆర్టీసీ బస్సులోనే ప్ర‌యాణించారు. వయసు, ఆరోగ్య ఇప్పుడు ప్రైవేటు వాహనాలను వాడుతున్నారు. అవి కూడా కొంద‌రు అభిమానులు ఏర్పాటు చేసిన‌వే.

''మా నాన్నగారు, రామయ్య గారూ చేసిన పోరాటాల‌వల్ల తిరువూరులో మావంటి అనేక కుటుంబాలకు నివాసం ఏర్పడింది. ఆయన పోరాటాల‌తో పేదలకు మేలు కలిగింది. అందుకే ఆయనకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు న్యూట‌న్‌.

కొన్నాళ్లపాటు విజయవాడ ఎంబీ విజ్ఞానకేంద్రంలో రామ‌య్య నివాసం ఉన్నారు. ఆయన అవసరాలకు తగిన ఏర్పాట్లు అక్కడి పార్టీ నాయకులు చూసేవారు.

ఆ తర్వాత ఉయ్యూరులోని రోటరీ వృద్ధాశ్రమంలో మూడేళ్లు గడిపారు. కొన్ని నెలలుగా ఆయన హైదరాబాద్‌లోని కూతురి ఇంట ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ ప్రజల మధ్య ఉండాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Paturi Ramaiah a Four times MLA, but no own house and land
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X