తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..?
తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్నీ నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. డీఎంకే మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షమైన AIADMK తిరిగి తమిళనాట చక్రం తిప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు విజయ్.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అరవ రాజకీయం అంతా దళపతి విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి.
విజయ్ ను ఎలాగైనా AIADMK-BJP కూటమిలోకి లాగాలని బీజేపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలని భావిస్తోంది. కానీ విజయ్ మాత్రం.. టీవీకే పార్టీకి ఎవరితోనూ పొత్తు లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య డీఎంకే, టీవీకే పార్టీలను ఓడించి మరోసారి అధికారాన్ని చేపట్టాలని AIADMK-BJP కూటమి కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించింది బీజేపీ.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళనాడులో ఆయనకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది తమిళనాడు మధురైలో మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు, అభిమానులు వచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తమిళ స్టైల్ పంచె కట్టుతో ఆకట్టుకున్నారు.
అయితే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తరఫున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. నాగేంద్రన్ నియోజకవర్గం అయిన సత్తూర్ లో పవన్ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సత్తూర్ నియోజకవర్గంలో తెలుగు మాట్లాడే ఓటర్లు చాలామంది ఉన్నారు. అందువల్ల పవన్ కల్యాణ్ ను బీజేపీ రంగంలోకి దింపినట్లు సమాచారం. త్వరలోనే పవన్ సత్తూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

మరోవైపు ఇటీవల AIADMK కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొత్తం 297 హామీలతో అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి విడుదల చేశారు. అందులో మహిళలకు ఉచితంగా ఏసీలు, స్టడీ లోన్ మాఫీ, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలు ఉన్నాయి. ఇక తమిళనాడులో ఏప్రిల్ 23 న ఎన్నికలు జరగనున్నాయి. మే 4 న ఫలితాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications