యుద్దం ఎఫెక్ట్ : పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!!
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్దం చమురు ఉత్పత్తుల పైన పడింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్రో ఉత్పత్తుల దిగుమతులను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు భారీగా పెంచాయి. సరఫరా విషయంలోనూ కొత్త ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో పెట్రోల్ - డీజిల్ ధరల పెంపు ఖాయమనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. ఆయిల్ కంపెనీలు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసారు. కాగా.. పెట్రోల్ - డీజిల్ ధరల విషయం పైన కేంద్రం కీలక ప్రకటన చేసింది.
పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూతపడిన నేప థ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల పెంపు తప్పదనే చర్చ సాగుతోంది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచారు. వంటగ్యాస్ సరఫరా ఇంటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ సరఫరా నిలిపి వేసారు. ఇదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు పైన ఆయల్ కంపెనీలు ప్రతిపాదనలు చేసాయి. కాగా.. కేంద్రం తాజాగా దేశంలో చమురు నిల్వలు.. రవాణా, దిగుమతుల పైన సమీక్ష చేసింది. ధరల పెంపు పై కేంద్రం స్పష్టతనిచ్చింది. కూడ్రాయిల్ ధరలు పెరిగినా.. దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నష్టాలను ఆయిల్ కంపెనీలు భరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఆయల్ కంపెనీలకు కేంద్రం తాజా మార్గదర్శకాలు
దీంతో.. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. సామాన్య ప్రజలకు, వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటుతున్న నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలపై భారం పడకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. నష్టాలను తాత్కాలికంగా భరించాలని కేంద్రం ఆదేశించింది. దేశంలో ఇప్పటికే ముడి చమురు నిల్వలు 25 రోజులకు, రిఫైన్డ్ ఇంధనాలు మరో 25 రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొంది. మొత్తంగా 8 వారాల ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయంది. ఇక.. రష్యా, ఇతర దేశాల నుంచి దిగుమతులు కొనసాగుతున్న నేథ్యంలో సరఫరా స్థిరంగా ఉంది. విశాఖపట్నం, మంగళూరు, పడూర్ మొదలైన వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పైప్‌లైన్లు, ట్యాంకులు, సముద్ర నౌకల్లో దాదాపు 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలున్నాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం సరఫరా వ్యవస్థలో ఉన్న చమురు ఉత్పత్తులు దాదాపు రెండు నెలల అవసరాలకు సరిపోతాయని తెలిపింది.












Click it and Unblock the Notifications