కర్ణాటక పెట్రోల్ బంకుల్లో భారీగా మిక్సింగ్: దడ పుట్టించే వాస్తవాలు
కర్ణాటకలోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక స్థాయిలో ఇథనాల్‌ను కలుపుతోండటం వాహనదారుల్లో దడ పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 20 శాతం పరిమితిని మించి ఏకంగా 31.2 శాతం వరకు పెట్రోల్‌లో ఇథనాల్ ను కల్తీ చేస్తోండటం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సేకరించిన పెట్రోల్ నమూనాలను ల్యాబ్ లల్లో పరీక్షించగా ఈ విషయం బయటపడింది. దీనిపై తక్షణ కార్యాచరణకు దిగింది ప్రభుత్వం. వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పెట్రోల్ బంకుల నుంచి సేకరించిన శాంపిళ్లను ల్యాబ్ లల్లో శాస్త్రీయంగా పరీక్షించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని ప్రభుత్వం తెలిపింది. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామనగర, మంగళూరు, తుమకూరు వంటి పలు జిల్లాల్లోని ఫ్యూయల్ స్టేషన్ల నుంచి ఈ శాంపిల్స్ సేకరించారు. ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన శ్రీరామ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ నమూనాలను విశ్లేషించగా, పరిమితికి మించిన ఇథనాల్ మిక్సింగ్ స్పష్టంగా బయటపడింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన శాంపిళ్లల్లో గరిష్టంగా 31.2 శాతం వరకు ఇథనాల్ కలిపారు. అలాగే హిందూస్థాన్ పెట్రోలియం బంకుల్లో కొన్ని చోట్ల 30.5, మరి కొన్ని చోట్ల 27 శాతం వరకు తేడా కనిపించింది. భారత్ పెట్రోలియం బంకుల్లో కూడా ఇదే పరిస్పథితి. ఇక్కడ శాంపిల్‌లో 26.5 శాతం మిక్సింగ్ రికార్డయింది. నయారా ఎనర్జీలో 26.1, షెల్ పెట్రోల్ బంక్ నమూనాలో 25.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఈ వివరాలను ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ వెల్లడించారు. ఆయిల్ కంపెనీల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఈ పెట్రోల్ నమూనాలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సొంత ల్యాబ్‌లకు పంపినప్పుడు ఇథనాల్ శాతాన్ని తమ నివేదికల్లో పొందుపరచలేదని తెలిపారు. ప్రత్యేకంగా ఇథనాల్ శాతాన్ని పరీక్షించాలని కోరినప్పటికీ వాటి వివరాలను ఓఎంసీలు దాచిపెట్టాయని ఆరోపించారు. అందువల్ల తామే సొంతంగా వాటిని శాంపిళ్లను పరీక్షించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులకు తీవ్ర సాంకేతిక నష్టం వాటిల్లుతుందని మంత్రి స్పష్టం చేశారు. అధిక ఇథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గిపోతుంది. ఇథనాల్ కు ఉండే రసాయన ధర్మాల వల్ల ఫ్యూయల్ పంప్‌లు, ఇంజెక్టర్లు, హోస్‌లు, రబ్బర్ సీల్స్ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అధిక బ్లెండింగ్‌కు అనుగుణంగా తయారుకాని పాత వాహనాలు, సాధారణ ఇంజిన్‌లు త్వరగా మొరాయిస్తాయి.
దీన్ని అరికట్టడానికి, వాహనదారుల ప్రయోజనాలను కాపాడటానికి కర్ణాటక ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచింది. అధిక ఇథనాల్ మిక్సింగ్ వల్ల దెబ్బతిన్న వాహనాలకు నష్టపరిహారం చెల్లించడానికి ఈ20 స్పోయిలేజ్ ఫండ్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరింది. కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా బాధిత వాహనదారులకు చమురు కంపెనీలే పరిహారం చెల్లించాలని, పెట్రోల్ నాణ్యత లోపానికి ఆయా సంస్థలే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
