బెంగళూరులో అత్త వారింట్లో ఏడుమందిని గ్రైండింగ్ స్టోన్ తో మట్టుబెట్టిన క్యాబ్ డ్రైవర్
బెంగళూరు నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుమందిని మట్టుబెట్టాడో క్యాబ్ డ్రైవర్. శ్రీరామ్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వరుస హత్యల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు.
ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు.. ఇందుశేఖర్. మృతులను ఇందుశేఖర్ భార్య సునీత, ఆమె తల్లి రూపవతి, సోదరులు శివకుమార్, శంకర్, వారి భార్యలు దివ్య, నళిని, ఏడేళ్ల బాలుడు పునీత్ గా గుర్తించారు. ప్రస్తుతం పునీత్ మృతదేహం మాత్రమే లభించింది. మిగిలిన వారి మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలు వల్ల ఇందుశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

దాదాపు 20 ఏళ్ల క్రితం సునీతతో ఇందుశేఖర్ కు వివాహమైంది. భార్యతో కలిసి చాలాకాలంగా శ్రీరామ్ పురాలో నివాసం ఉంటోన్నాడతను. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తోన్నాడు. సునీత తన పుట్టింటి కుటుంబ సభ్యులతో నిరంతరం సన్నిహితంగా ఉండటం అతని తీవ్ర అసంతృప్తిని కలిగించేది. ఈ విషయంపై తరచూ సునీతతో గొడవపడేవాడు. సునీతకు ఆమె తల్లి, సోదరులు పూర్తి మద్దతుగా నిలవడంపై ఆగ్రహంతో రగిలిపోతుండేవాడు.
చివరికి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా అంతమొందించాలని పక్కా వ్యూహం పన్నాడు. మొదట తన భార్యనే బలి తీసుకున్నాడు. ఇంట్లో గ్రైండింగ్ స్టోన్ తో బాది హత్య చేశాడు. అనంతరం ఆమె స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిందని బంధువులను నమ్మించాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా సునీత సోదరులను ఇంటికి పిలిపించుకున్నాడు. శివకుమార్, ఆ తర్వాత శంకర్‌ను ఇంటికి పిలిపించి హతమార్చాడు. వారి వెనుకే తోటికోడళ్లు నళిని, దివ్య, అత్త రూపవతితో పాటు ఏడేళ్ల చిన్నారి పునీత్‌ను కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడు.
ఈ క్రమంలో నళిని కనిపించట్లేదంటూ ఆమె తల్లి శ్రీరామ్ పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానితుల్లో ఇందుశేఖర్ పేరును చేర్చారు. దీంతో దర్యాప్తు మలుపు తిరిగింది. విచారణలో భాగంగా ఇందుశేఖర్‌ను ప్రశ్నించిన పోలీసులకు అతను ఇచ్చిన స్టేట్ మెంట్లపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో పోలీసులు నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. అనుమానాలు బలపడటంతో తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఇందుశేఖర్.. తాను చేసిన ఘాతకాన్ని అంగీకరించాడు.
హత్యల అనంతరం మృతదేహాలను చిక్కబళ్ళాపుర జిల్లాలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో పారేసినట్లు వెల్లడించాడు. పోలీసులు నిందితుడిని అక్కడికి తీసుకెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు గాలించగా, పునీత్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగిలిన ఆరు మృతదేహాల కోసం పరిసర అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు.
నేరం చేసిన తర్వాత ఇంట్లోని రక్తం మరకలను శుభ్రం చేసి, హత్యకు ఉపయోగించిన రాతిని కడిగి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను నంది హిల్స్, పరిసర ప్రాంతాలకు తరలించడానికి వాడిన కారును సీజ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని, ఈ దారుణ వెనుక మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని బెంగళూరు నార్త్ జోన్ డీసీపీ బాబాసాబ్ నేమాగౌడ వెల్లడించారు.












Click it and Unblock the Notifications
