పిఎం మీడియా మీట్: రాహుల్ పేరును ప్రకటిస్తారా?
న్యూఢిల్లీ: యుపిఎ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటిస్తారని అంటున్నారు. దానికోసమే ఆయన ఈ నెల 3వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేయడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఖండించారు.
యుపిఎ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సంకీర్ణ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను దేశ ప్రజలకు వివరించటంతోపాటు, ప్రతిపక్షం తనపై చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు మన్మోహన్ సింగ్ జనవరి 3న ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 300మంది మీడియా ప్రతినిధులు హాజరవుతున్న సమావేశంలో రాహుల్ గురించి మన్మోహన్ ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే, మన్మోహన్ సింగ్ పూర్తి కాలం ప్రధానిగా కొనసాగేలా చూస్తూ రాహుల్‌ను యూపీఏ తదుపరి అధినాయకుడిగా ప్రకటించటం మంచిదని కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణం చేతనే మన్మోహన్ సింగ్ మొదట రాహుల్ గాంధీని యూపీఏ అధినాయకుడిగా ప్రకటించటంతోపాటు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనే కూటమి ప్రధాని అభ్యర్థి అనే సందేశం పంపించవచ్చని అంటున్నారు. ప్రధాని ప్రకటన అనంతరం జనవరి 17న ఢిల్లీలో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో రాహుల్‌ను కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తుందని చెబుతున్నారు.
పార్టీతోపాటు సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రాజకీయపరమైన నిర్ణయాలూ తీసుకునే అధికారాన్ని రాహుల్ గాంధీకి అప్పగించవచ్చని చెబుతున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశమంతా పర్యటిస్తూ 2014 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచార యుద్ధం కొనసాగిస్తుంటే, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవటం ఎంతమాత్రం మంచిది కాదని పార్టీ నాయకులతోపాటు యూపీఏ భాగస్వామ్య పార్టీలు, మిత్రపక్షాలు వాదిస్తున్నాయి.












Click it and Unblock the Notifications