టీ తోటల్లో ప్రధాని మోదీ- అట్నుంచి నరుక్కొస్తున్నారు మరి
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అస్సాం, 23న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ ఎన్నికల ప్రకటనతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎమ్‌సీసీ) అమలులోకి వచ్చింది.
ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి అస్సాంలో పర్యటిస్తోన్నారు. నేడు గువాహటిలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే- రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ ఉదయమే ఢిల్లీ నుంచి నేరుగా గువాహటికి చేరుకున్నారు. అక్కడి నుంచి దిబ్రూగఢ్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడి టీ తోటలను సందర్శించారు. మహిళా కార్మికులతో ముచ్చటించి, అస్సాం టీ ప్రపంచ ప్రాముఖ్యతను వివరించారు.

దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. తేయాకు, టీని అస్సాం ఆత్మగా అభివర్ణించారు. ఇక్కడ లభించే తేయాకునకు ప్రపంచ గుర్తింపు ఉందని పేర్కొన్నారు. దిబ్రూగఢ్ జిల్లాలోని టీ తోటల్లో పర్యటించడం, అక్కడి మహిళా కార్మికులతో ముచ్చటించడం మరపురాని అనుభవంగా మోదీ అభివర్ణించారు. మహిళా కార్మికులు టీ పరిశ్రమకు వెన్నెముకగా ఉన్నారని, తేయాకు తెంపడం, దాన్ని ప్రాసెస్ చేయడంలో వారి కృషి అధికమని ప్రశంసించారు.
ప్రతి టీ తోట కుటుంబ కృషికి తాను ఎంతగానో గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. మహిళల కఠోర శ్రమ అస్సాం గౌరవాన్ని రెట్టింపు చేసిందని తన తన ట్వీట్ లో పేర్కొన్నారు. టీ ఆకులు తెంపిన తర్వాత మహిళలు తమ సంస్కృతి గురించి చాలా చక్కగా మాట్లాడారని, వారి అనుభవాలు కష్టసుఖాలను పంచుకున్నారని అన్నారు. గుజరాత్ రైల్వే స్టేషన్‌లో తండ్రితో కలిసి టీ అమ్మినప్పటి బాల్యాన్ని మోదీ తరచుగా గుర్తు చేసుకుంటుంటారనే విషయం తెలిసిందే. ఇది సామాన్యుడి నుండి దేశ అత్యున్నత పదవికి ఆయన ఎదుగుదలకు ప్రతీకగా నిలిచింది.
అస్సాం ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఉత్పత్తి ప్రాంతం. భారత టీ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. దిబ్రూగఢ్ సహా జిల్లాలో లక్షలాది మందికి, ముఖ్యంగా మహిళలకు ఇది ఉపాధినిస్తోంది. మోదీ టీ తోటల సందర్శన వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ అస్సాంలో చేపట్టిన ప్రచార పర్యటనలో ఈ సందర్శన భాగం. ఆయన అనేక బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.












Click it and Unblock the Notifications