ప్రధాని మోదీ అనూహ్య ఎత్తుగడ- ఈ రాత్రి 8:30 గంటలకు
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఏపీ మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా ప్రతిఘటించిన ఈ డిలిమిటేషన్ బిల్లుపై సభలో అధికార పక్షానికి చుక్కెదురైంది. బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ఇది వీగిపోయింది. దీంతో విపక్షాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది.
దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎత్తుగడలు వేస్తోంది. ప్రతిపక్షాల ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తెరమీదికి రానున్నారు. ఈ రాత్రి 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. బిల్లు వీగి పోవడానికి గల కారణాలను ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. సుమారు 45 నిమిషాల పాటు మోదీ ప్రసంగించవచ్చు.

డీలిమిటేషన్ బిల్లు వీగి పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో తలెత్తిన పరిణామాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొనడంలో భాగంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల నష్టపోతామని వాదిస్తోన్న దక్షిణాది రాష్ట్రాలకు నమ్మకం కలిగించేలా ఓ వివరణ ఇస్తారని తెలుస్తోంది. 2023 నాటి చట్టంలో ఉన్న అంశాలతో వాటిని సవరించడం వల్ల మహిళలకు కలిగే లాభాల గురించి వెల్లడిస్తారని అంటున్నారు. బిల్లుపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది కూడా మోదీ ప్రజలకు తెలియజేస్తారని సమాచారం.
అదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలపై వ్యూహాత్మక దాడికి సైతం దిగొచ్చు. ప్రతిపక్షాలన్నీ కూడా మూకుమ్మడిగా మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఇప్పటికే ప్రధాని మోదీ, ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తోన్నారు. ఇదే విషయాన్ని మరోసారి బాహటంగా విమర్శలు గుప్పిస్తారని చెబుతున్నారు. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో సైతం ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
ఈ బిల్లు వీగిపోవడాన్ని స్వాగతించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు కేంద్రం పన్నిన కుట్ర అని ఆమె ఆరోపించారు. బిల్లు పరాజయాన్ని రాజ్యాంగానికి, దేశానికి దక్కిన అతి గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు.












Click it and Unblock the Notifications