మోదీ సాష్టాంగ నమస్కారం- సెంగోల్ ప్రతిష్ఠాపన
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొత్తగా రూపుదిద్దుకున్న పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలు వైభవంగా ఆరంభం అయ్యాయి. ఆ ప్రదేశం మొత్తం వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగిపోతోంది. వేర్వేరు మఠాలు, పీఠాల నుంచి వచ్చిన ఆధీన పండితుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ఆధీన పండితులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.
ఈ ఉదయం సరిగ్గా 7:30 గంటలకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా- ప్రత్యేక వాహనాల్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రాంగణానికి చేరుకున్నారు. తొలుత జాతిపతి మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులకు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. వారికి శాలువాలను కప్పారు. ప్రశంసా పత్రాలను అందజేశారు.

#WATCH | PM Modi receives blessings of seers of different Adheenams from Tamil Nadu after the installation of the 'Sengol' in the new Parliament building in Delhi pic.twitter.com/Hex1LaWA8X
— ANI (@ANI) May 28, 2023
అనంతరం కొత్త పార్లమెంట్ భవనం ఆవరణలోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆధీన పండితులు ప్రధానికి ఆశీర్వచనాలు పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన యాగ మండపానికి వెళ్లారు. స్పీకర్‌తో కలిసి యజ్ఞ, యాగాదుల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా సెంగోల్‌కు ప్రత్యేక పూజలను నిర్వహించారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రధాని- సెంగోల్‌కు సాష్టాంగ నమస్కారం చేయడం కనిపించింది.
పూర్ణాహవచనం, ప్రత్యేక పూజల తరువాత సెంగోల్‌ను ఆధీన పండితులు ప్రధాని చేతికి అందజేశారు. సెంగోల్‌ను అందుకున్న తరువాత ఆయన పండితుల నుంచి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆధీన పండితులు వెంటరాగా- సెంగోల్ సహా యాగ మండపం నుంచి పార్లమెంట్ భవనంలోనికి ప్రవేశించారు మోదీ. పార్లమెంట్ భవనం లోపల తమిళ సంప్రదాయం ప్రకారం.. కీర్తనలను ఆలపించారు గాయకులు.
#WATCH | PM Modi bows as a mark of respect before the 'Sengol' during the ceremony to mark the beginning of the inauguration of the new Parliament building pic.twitter.com/7DDCvx22Km
— ANI (@ANI) May 28, 2023
ఓం బిర్లతో కలిసి నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు ప్రధాని. స్పీకర్ స్థానం వద్ద సెంగోల్‌ను అమర్చారు. దీనికోసం ప్రత్యేకంగా అద్దాలతో ఓ బాక్స్‌ను తయారు చేశారు. అందులో దీన్ని అమర్చారు మోదీ. దీనికి సంకేతంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలకు మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రులందరూ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications