అమరావతిపై ప్రధాని మోదీ ఆరా
Chandrababu NITI Aayog meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యారు. ఇది- 10వ నీతి ఆయోగ్ సమావేశం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించారు.
వికసిత్ రాజ్య్ ఫర్ విక్షిత్ భారత్ @ 2047- అనేది ఈ భేటీ ముఖ్య ఉద్దేశం. 2047 నాటికి భారత్ సాధించాల్సిన లక్ష్యాల గురించి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటైంది. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు ఇందులో పాల్గొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాలు చోటుచేసుకున్న అనంతరం నీతి ఆయోగ్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఫలితంగా దీనిపై అందరి దృష్టీ దీనిపై నిలిచింది. ఎలాంటి తీర్మానాలు, నిర్ణయాలు, ప్రతిపాదనలు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.
ఈ సమావేశం ఆరంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. వారితో ముచ్చట్లు పెట్టారు. సరదాగా సంభాషించారు. తమ తమ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోన్న పరిణామాల గురించి ఆరా తీశారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రధాని మోదీ ఇటీవలే పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. దీని పురోగతి గురించి ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబును అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. పునఃప్రారంభం అనంతరం.. ఇప్పటివరకు సాగిన నిర్మాణ పనుల గురించి చంద్రబాబు క్లుప్తంగా వివరించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీకి నలుగురు ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, పినరయి విజయన్, మమత బెనర్జీ, ఎన్ రంగస్వామి.. డుమ్మా కొట్టారు. పశ్చిమ బెంగాల్ తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ హాజరైనట్లు సమాచారం.
పినరయి విజయన్ కు బదులుగా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బాలగోపాల్ ఈ నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యారు. పినరయి గైర్హాజర్ కావడానికి గల కారణాలు ఏమిటనేది వెల్లడి కాలేదు. సిద్ధరామయ్య కూడా ఈ సమావేశానికి దూరం అయ్యారు. మైసూరులో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున ఆయన దీనికి హాజరు కాలేదని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications