మోడీ కేబినెట్ సంచలనం: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ సోమవారం చారిత్రక ప్రకటన చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది.

సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన 90 నిమిషాలపాటు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కాగా, ప్రస్తుతం, లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉండగా, అందులో 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా, అందులో 24 మంది మహిళా సభ్యులు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది 25 ఏళ్లకుపైగా ఆమోదానికి నోచుకోవడం లేదు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తి స్థాయి మెజార్టీ మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. తాజాగా, అధికార పార్టీతోపాటు మిగితా పార్టీలు కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లుకు మోక్షం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు బీసీ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications