మోదీ నామినేషన్‌లో పాల్గొనే నేతలు వీళ్లే: ఏపీ నుంచి వాళ్లిద్దరు.. తెలంగాణ గల్లంతు
Chandrababu Naidu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నుంచి ముచ్చటగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. నేడు ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. వారణాశి స్థానానికి చివరి విడతలో అంటే జూన్ 1వ తేదీన పోలింగ్ జరుగనుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇప్పటికే మోదీ వారణాశికి చేరుకున్నారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రపాలకుడు కాలభైరవుడు, కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం మోదీ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. అంతకుముందు రోడ్ షోను నిర్వహించనున్నారాయన.

మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల పార్టీ నాయకులకు ఆహ్వానాలు అందాయి. మొత్తం 25 మంది దీనికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి జాబితాను భారతీయ జనతా పార్టీ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.
ఈ జాబితాలో ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్లు ఉన్నాయ. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్దిరోజుల ముందు వారిద్దరూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్డీఏలో భాగస్వామ్యులయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీ నేతలెవరికీ ఆహ్వానాలు అందలేదు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రఫుల్ పటేల్, రామ్‌దాస్ అథవాలే, హర్‌దీప్ పురీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయా ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, ఏక్‌నాథ్ షిండే, కొనార్డ్ సంగ్మా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా, సంజయ్ నిషాద్, అనుప్రియా పటేల్, ఓం ప్రకాష్ రాజ్‌భర్, జయంత్ చౌదరి, అన్బుమణి రామదాస్, జీకే వాసన్, దేవనాథన్ యాదవ్, తుషార్ వెల్లాపల్లి, అతుల్ బోరా, ప్రమోద్ బోరో, పశుపతి పారాస్, భూపేంద్ర చౌదరి.. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications