ఇండియాలో 2500 రాజకీయ పార్టీలా..? షాక్‌లో ఘనా అధ్యక్షుడు
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, గురువారం ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆయన ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించిన మోదీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ వ్యక్తీకరణ, చర్చల ఆవశ్యకత గురించి వివరించారు.
మోదీ తన ప్రసంగాన్ని ఇంగ్లీషులో కొనసాగిస్తూ, భారతదేశంలో 2,500కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పగానే, ఘనా పార్లమెంటు సభ్యులు ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, నేను మళ్ళీ చెబుతున్నాను, ఇండియాలో 2,500 రాజకీయ పార్టీలు ఉన్నాయని నొక్కి చెప్పారు. నిజమైన ప్రజాస్వామ్యం చర్చను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రజలను ఏకం చేస్తుంది, గౌరవానికి మద్దతు ఇస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుందని మోదీ అన్నారు.

"హమారే లియే లోక్తంత్ర వ్యవస్థ నహీ, సంస్కార్ హై" అని హిందీలో చెప్పిన ప్రధాని, ఆ వాక్యాన్ని మాకు ప్రజాస్వామ్యం అనేది ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అది మా సంస్కారమని ఆంగ్లంలో అనువదించారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూర్చే విధంగా దేశంలోని విస్తారమైన వైవిధ్యాన్ని ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాలను పాలిస్తున్న 20 వేర్వేరు పార్టీలు, 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు. భారతదేశానికి వచ్చిన ప్రజలను ఎల్లప్పుడూ విశాల హృదయాలతో స్వాగతించడానికి ఇదే కారణమని ప్రధాని పేర్కొన్నారు.
ఇదే స్ఫూర్తి.. భారతీయులు ఎక్కడికి వెళ్ళినా సులభంగా కలిసిపోవడానికి సహాయపడుతుందని మోదీ తెలిపారు. ప్రధాని ప్రసంగం అనంతరం, ఘనా పార్లమెంట్ స్పీకర్ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ కూడా 2,500 రాజకీయ పార్టీల సంఖ్యను పునరావృతం చేయడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ ప్రసంగం భారత్-ఘనా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications