ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్: మూల్యం చెల్లించుకోక తప్పదు
దేశ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలు చారిత్రాత్మక తప్పిదం చేశాయని, దీనికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా సాగిన ఈ హైడ్రామా తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ అత్యంత సీరియస్‌గా స్పందించారు.
లోక్‌సభలో గురువారం ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజాము వరకు సాగిన సుదీర్ఘ చర్చ తర్వాత జరిగిన ఓటింగ్‌లో బిల్లు వీగిపోయింది. 33 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన రెండొంతుల మెజారిటీ లభించలేదు. "ప్రతిపక్షాలు దేశ మహిళల నమ్మకాన్ని వమ్ము చేశాయి. వారు దేశంలోని ప్రతి వ్యక్తికి, ప్రతి గ్రామానికి సమాధానం చెప్పుకోవాలి. వారు చేసిన ద్రోహాన్ని ప్రజలందరికీ వివరించండి" అని ప్రధాని తన మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

దక్షిణ భారతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం!
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) జరిగితే లోక్‌సభలో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే నెపంతో ప్రతిపక్షాలు ఈ బిల్లును అడ్డుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కు పెరిగినప్పుడు ఏ ఒక్క దక్షిణ రాష్ట్రానికి అన్యాయం జరగదని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో వ్యక్తిగత హామీ ఇచ్చారు. "ఇది దేశ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నం, రాజకీయ కోణంలో చూడకండి" అని ప్రధాని విజ్ఞప్తి చేసినా విపక్షాలు పట్టించుకోకపోవడంపై హోంమంత్రి అమిత్ షా సైతం మండిపడ్డారు.
విపక్షాల ఎదురుదాడి.. ప్రియాంక గాంధీ హర్షం!
మరోవైపు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం, దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చడానికే ఈ బిల్లును పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ బిల్లు ఓటమిని "ప్రతిపక్షాల ఐక్యతకు దక్కిన విజయం"గా అభివర్ణించడం గమనార్హం.
అత్యంత ఉత్కంఠ మధ్య ముగిసిన ఈ మూడు రోజుల పార్లమెంట్ సమావేశాలు, మహిళా రిజర్వేషన్ల చుట్టూ దేశ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. మోదీ సర్కార్ ఈ అంశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో మున్ముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.














Click it and Unblock the Notifications