వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్- రూట్లు ఇవే..
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ఈ క్రమంలో మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బెంగళూరులో ఆయన పర్యటించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు బెంగళూరులోని క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్ లో ఈ మూడు రైళ్లకూ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
బెంగళూరు- బెళగావి, అజ్ని (నాగ్ పూర్)- పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా మార్గాల్లో కొత్తగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ మార్గాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించనున్నారు.
ప్రతి రోజు తెల్లవారు జామున ఈ ఎక్స్ ప్రెస్.. బెళగావి నుంచి 5:20 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:50 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి బెంగళూరు నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి రాత్రి 10:40 గంటలకు బెళగావికి చేరుకుంటుంది. ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు స్టేషన్లల్లో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం ఉంది.












Click it and Unblock the Notifications