అక్రమ వలసదారులకు మోదీ భరోసా
Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.
అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా. తొలి దశలో 205 మంది భారతీయులను మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కించి ఇంటికి పంపించింది. మలిదశలో మరి కొందిరిని ఏరివేయడానికి రంగం సిద్దం చేసింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.

ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్ర నరేంద్ర మోదీ అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారాయన. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ కానున్నారు. వైట్ హౌస్ ఓవల్ కార్యాలయం దీనికి వేదిక.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయనతో మోదీ భేటీ కాబోతోండటం ఇదే తొలిసారి. అంతకంటే ముందు ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని. 10, 12 తేదీల్లో పారిస్‌లో ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు హాజరవుతారు. ప్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్‌తో భేటీ అవుతారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.
డొనాల్డ్ ట్రంప్‌తో జరిగే భేటీలో వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, డిజిటల్, రక్షణరంగంలో పరస్పర సహకారం, ఉగ్రవాద అణచివేత, కౌంటర్ టెర్రరిజం, ఇండో- పసిఫిక్ సెక్యూరిటీ.. వంటి కీలకాంశాలపై ట్రంప్- మోదీ మధ్య చర్చలు సాగుతాయి. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలపైనా సంతకాలు పెట్టే అవకాశాలు లేకపోలేదు.

అదే సమయంలో- అక్రమ వలసదారుల వ్యవహారం వారిద్దరి మధ్య ప్రస్తావనకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అక్రమ వలసదారులను క్రిమినల్స్‌గా ట్రీట్ చేస్తూ, కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి మరీ వారిని స్వదేశానికి పంపించిన విధానం పట్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేసిన విషయం తెలిసిందే.
దీనిపై విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ రాజ్యసభలో ఓ విస్పష్ట ప్రకటన సైతం చేశారు. ఇదే అంశాన్నీ మోదీ కూడా డొనాల్డ్ ట్రంప్‌తో జరిగే భేటీలో ప్రస్తావిస్తారని సమాచారం. అక్రమ వలసదారులను వెనక్కి పిలిపించుకోవడంపై హామీ ఇవ్వడంతో పాటు.. కొంత సమయం అడగొచ్చని తెలుస్తోంది.
అమెరికాలో 5.4 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తోన్నారు. 3,50,000 మంది విద్యార్థులు దీనికి అదనం. ఈ పరిస్థితుల్లో అక్రమ వలసదారుల సమస్య తెరమీదికి రావడం వల్ల రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా దీన్ని పరిష్కరించుకోవాలని కేంద్రం భావిస్తోంది.












Click it and Unblock the Notifications