పుతిన్‌కు తేల్చి చెప్పిన మోదీ
PM Modi with Putin: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే ఉక్రెయిన్‌లో పర్యటించారు. రాజధాని కీవ్‌లో ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక- రక్షణ ఒప్పందాలపై చర్చించారు. సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో శాంతి చర్చలను ప్రతిపాదించారు. చర్చల వల్ల అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.
ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా చర్చలు సాగించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో, భద్రతమండలి భేటీలో నిర్వహించిన ఓటింగ్‌లో భారత్ అనుసరించిన విధానాల గురించీ గుర్తుచేశారు ప్రధాని మోదీ.

ఒక భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తోండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది ఉక్రెయిన్. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు చెందిన ఏ ప్రధాని కూడా ఆ దేశానికి వెళ్లలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్లిన తొలి ప్రధానిగా రికార్డు నెలకొల్పారు మోదీ.
సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ.. ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పలు దేశాలు సానుకూలంగా స్పందించాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడానికి మోదీ వేసిన ఓ గొప్ప అడుగుగా అభివర్ణించాయి. తన శతృదేశంలో ప్రధాని మోదీ పర్యటించడం పట్ల రష్యా ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఈ పరిస్థితుల్లో- ప్రధాని మోదీ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పర్యటన అనంతరం మోదీ.. ఆయనతో సంభాషించడం ఇదే తొలిసారి. పుతిన్‌తో చర్చించిన అంశాల గురించి మోదీ క్లుప్తంగా వివరించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
రష్యా ఎప్పటికీ ఓ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబందాలను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్యసు దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం, ఇటీవలి ఉక్రెయిన్ పర్యటన వివరాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు.
సుస్థిర, శాంతియుత వాతావరణం, సానుకూల పరిస్థితుల్లో అన్ని రకాల సమస్యలను పరిష్కారించుకోవడానికి ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందని పుతిన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రష్యాకు అండగా నిలుస్తామని, ఈ విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తామని మోదీ పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications