రీల్స్‌పై మోదీ తీవ్ర వ్యాఖ్యలు! యూత్ కు సీరియస్ మెసేజ్
నేటి సమాజంలో క్షణంలో వైరల్ అయ్యే సోషల్ మీడియా రీల్స్ సంస్కృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. విజయం సాధించడానికి దొంగ దారులు, షార్ట్‌కట్‌లు వెతుక్కోవడం వల్ల జీవితాలు నాశనమవుతాయని, ప్రగతి సాధించాలంటే సుదీర్ఘమైన అనుభవం, పుస్తక పఠనం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ 'ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, నేటి యువతరం రీల్స్ మాయలో పడకుండా ప్రముఖుల జీవిత చరిత్రలను, ఆత్మకథలను చదవాలని విజ్ఞప్తి చేశారు.

'షార్ట్‌కట్ ప్రాణాలకే ముప్పు'!
ఢిల్లీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నేటి తరం ఆలోచనా విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ మోజులో పడి యువత కాలం వృథా చేసుకుంటోంది. రైల్వే స్టేషన్లలో తరచూ ఒక బోర్డు కనిపిస్తుంది.. 'షార్ట్‌కట్‌లు ప్రమాదకరం' అని! జీవితానికి కూడా ఇది వందకు వంద శాతం వర్తిస్తుంది. షార్ట్‌కట్ దారుల్లో విజయం వెతుక్కోవడానికి బదులు, ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయుల ఆత్మకథలను చదవడం అలవాటు చేసుకోండి. అది మీకు సరైన బాటను చూపుతుంది" అని ప్రధాని సలహా ఇచ్చారు.
సంస్కారానికి నిలువుటద్దం రామ్‌నాథ్ కోవింద్
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అణకువ, ఆయన పాటించిన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాష్ట్రపతిగా అత్యున్నత హోదాలో ఉన్నప్పటికీ, ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ప్రధాని కారు దాకా వచ్చి సాగనంపే వారని, ఆ వినయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
అలాగే, రాష్ట్రపతి అయ్యాక తన సొంత ఊరు పరౌంఖ్ కు వెళ్లినప్పుడు, ప్రాథమిక పాఠశాల గురువుల పాదాలకు నమస్కరించిన దృశ్యం దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా మూలాలను మర్చిపోకపోవడమే అసలైన వ్యక్తిత్వమని పేర్కొన్నారు.
చిన్ననాటి విషాదం.. 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' సాధన దిశగా పోరాటం!
కోవింద్ ఆత్మకథలో పేర్కొన్న చిన్ననాటి విషాదాన్ని స్మరించుకుంటూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. వేసవిలో ఇల్లు తగలేబడినప్పుడు సామాన్లను కాపాడుకునే క్రమంలో కోవింద్ గారు తన తల్లిని అగ్నికి ఆహుతి కావడం అత్యంత కఠినమైన సంఘటన అని మోదీ ఆవేదన చెందారు.
ఇక పదవీ విరమణ చేసిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా దేశ సంస్కరణల కోసం పని చేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా భారతదేశంలో 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' విధానం తీసుకురావడానికి కోవింద్ పడుతున్న శ్రమ, ప్రజాస్వామ్య వ్యవస్థలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ప్రధాని ఆకాంక్షించారు.














Click it and Unblock the Notifications