న్యాయ ప్రక్రియకు లోబడి తెలంగాణ: ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం తెలంగాణకు కట్టుబడి ఉందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారం లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అఖిల పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఆ విషయం చెప్పారు. న్యాయ ప్రక్రియకు లోబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లోనే ప్రతిపాదించాలని బిజెపి నేత సుష్మా స్వరాజ్ అఖిల పక్ష సమావేశంలో కోరారు. అందుకు ప్రయత్నిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ చెప్పారు. తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రతిపాదించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా సూచించాయి. పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజులు పెంచాలని కూడా కోరాయి. ఇందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

రాజ్యసభ పార్లమెంటు సభ్యులను, ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు సభ్యులను సంప్రదించిన తర్వాత పార్లమెంటు సమావేశాలను పొడిగించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కమల్‌నాథ్ చెప్పారు. పాట్నా పేలుళ్ల నేపథ్యంలో అంతర్గత భద్రతపై చర్చించాలని బిజెపి పట్టుబట్టే అవకాశం ఉంది.
మహిళ పట్ల జరుగుతున్న నేరాలపై, 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌రపై పార్లమెంటరీ ప్యానెల్‌పై చర్చించాలని తాము డిమాండ్ చేసినట్లు సుష్మా స్వరాజ్ చెప్పారు. ముజఫర్ నగర్ అల్లర్లపై, ఆర్థిక వ్యవస్థపై చర్చించాలని వామపక్షాలు కోరాయి.
లోక్‌పాల్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఈ సమావేశాల్లో ప్రతిపాదించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే తెలంగాణ బిల్లుపై ప్రభుత్వం ప్రస్తావించలేదు. తెలంగాణ బిల్లును వెంటనే ప్రతిపాదించాలని బిజెపి కోరింది.












Click it and Unblock the Notifications