రైతన్నకు అవమానం: ప్రధాని కార్యాలయానికి మనిఆర్డర్ పంపితే వచ్చిన సమాధానం ఇదీ..!
రైతు దేశానికి అన్నం పెట్టే అన్నదాత. ఎప్పుడైతే రైతు సంతోషంగా ఉంటాడో అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతు జీవనం చాలా అధ్వాన్నంగా తయారైంది. తాను పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోవడంతో లబోదిబోమంటున్నాడు. తాజాగా ఉల్లి రైతులు భారీ నష్టాలను చవిచూశారు. కిలో ఉల్లి ఒక్క రూపాయికి అమ్మాల్సిన వచ్చిందంటే... రాత్రనక పగలనక కష్టపడి పంటను పండించిన రైతు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఊహించొచ్చు. తాజాగా ఓ రైతు తాను పండించిన ఉల్లిని విక్రయించగా వచ్చిన డబ్బును ఏమి చేశాడో తెలుసా...?

మనీ ఆర్డర్ పంపితే ఆన్‌లైన్‌లో బదిలీ చేయాలన్న పీఎంఓ
సంజయ్ సాథె అనే రైతు ఉల్లిని సాగు చేశాడు. ఉల్లిపంట చేతికి రాగానే దానికి మంచి ధర వస్తుందని భావించిన రైతుకు నిరాశే మిగిలింది. 750 కేజీల ఉల్లి ధర విక్రయించగా ఆయనకు వచ్చిన డబ్బు అక్షరాల రూ.1064. ఇక ఈ డబ్బుతో ఏమి చేయాలి అనుకున్నాడో ఏమో తెలియదుగాని ఆ డబ్బును ప్రధాని సహాయనిధికి మనీఆర్డరు చేశాడు. అయితే ప్రధాని కార్యాలయం మాత్రం అవహేళన చేసింది.

ప్రధాని కార్యాలయం అవమానించింది
సంజయ్ సాథె ప్రధాని సహాయనిధికి పంపిన రూ.1064 మనీ ఆర్డరును ప్రధాని కార్యాలయం తిరిగి వెనక్కు పంపించింది. తిరిగి వెనక్కు ఎందుకు పంపించిందో తెలుసా...? ఇలా డబ్బులను క్యాష్ రూపంలో తీసుకోవడం లేదట. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే డబ్బును స్వీకరిస్తున్నట్లు వివరణ ఇచ్చింది ప్రధాని కార్యాలయం. సంజయ్ సాథెకు తిరిగి డబ్బును పంపించి ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా తెలిపింది. ఈ డబ్బును పంపితే ప్రధాని కార్యాలయం రైతు పరిస్థితిపై సానుభూతి చూపుతుందని తాను భావిస్తే హేళన చేస్తూ తిరిగి డబ్బును పంపి ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ చెప్పడం తనను ఎంతగానో బాధించిందని సంజయ్ తెలిపాడు.

750 కిలోల ఉల్లి అమ్మగా చేతికి వచ్చింది రూ. 1064 మాత్రమే
ఇక విషయానికొస్తే ఆరుగాలం పనిచేసి ఉల్లిపంటను పండించాడు రైతు సంజయ్. పంట చేతికొచ్చిందన్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పంట చేతికి రాగానే దాదాపు 750 కిలోల ఉల్లిని నిఫాడ్ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌కు గతవారం తీసుకెళ్లాడు. అయితే ఉల్లికి పలికిన ధర తెలిసి షాక్‌కు గురయ్యాడు. ఉల్లిపాయలను అమ్మగా వచ్చిన డబ్బును చూసి లబోదిబోమన్నాడు. కేజీ ఉల్లి రూ. 1.41 పలకడంతో 7.5 క్వింటాళ్ల ఉల్లికి ఆయనకొచ్చింది కేవలం రూ. 1064 మాత్రమే.












Click it and Unblock the Notifications