అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు సోదరి ఇంటికి పోలీసులు.. ఫిర్యాదు చేసిన భద్రతా సిబ్బంది - ప్రెస్‌ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోదరి కె.హైమావతి ఇంటికి పోలీసులమని వచ్చి కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా లోపలికి వెళ్లారని, దీనిపై ఆ ఇంటి భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

చంద్రబాబు సోదరి ఇంటికి వచ్చిన పోలీసులు పరిసరాలను ఫొటోలు తీశారని సెక్యూరిటీ సిబ్బంది బుధవారం చంద్రగిరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో హైమావతి నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు పోలీసులమని లోనికి వెళ్లారు.

ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలను చూసి బయటకు వచ్చి, పరిసరాలను ఫొటోలు తీసుకుని వెళ్లారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సెక్యూరిటీ గార్డ్‌ రవి పోలీసులకు అందించారు.

సీఐడీ అధికారులు చంద్రబాబునాయుడుకు మంగళవారం ఉదయం నోటీసులు జారీ చేయగా సాయంత్రం ఆయన సోదరి ఇంటికి పోలీసులు రావడంతో చర్చనీయాంశమైంది.

ఇదే విషయంపై సీఐ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా, నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని పొరపాటున తమ సిబ్బంది నారావారిపల్లెకి కాకుండా కందులవారిపల్లెకి వెళ్లారని చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.

హైమావతి కుమార్తె పేరు కూడా సుచరిత కావడంతో ఆమె ఇంటికి వెళ్లినట్లు సీఐ తెలిపారని ఈ కథనం పేర్కొంది.

రెండు రోజుల్లో పీఆర్సీ-శాసన సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటన

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇండియాలోనే ఎక్కువ జీతం పొందుతున్నామని చెప్పుకొనేలా వేతనాలు ఇస్తున్నామని, రెండు మూడు రోజుల్లో అసెంబ్లీలోనే పీఆర్సీని ప్రకటిస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసన సభలో ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

కరోనా కారణంగా రాష్ట్రం మీద దాదాపు లక్ష కోట్ల భారం పడిందని, ప్రత్యక్షంగా రూ.52వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు నష్టపోయామని కేసీఆర్‌ వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.

కరోనా సమస్యల కారణంగా పీఆర్సీ కొంచెం వెనకా ముందు అయ్యిందని, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిసినందున ఇదే శాసన సభలో రాబోయే రెండు, మూడు రోజుల్లో అద్భుతంగా, గౌరవప్రదంగా ఉండే పీఆర్సీని తానే ప్రకటిస్తానని సీఎం చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.

రాష్ట్రంలో కరోనా పెరుగుదలను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకొంటున్నామని, పాఠశాలలు కొనసాగించడంపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం శాసనసభకు తెలిపినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

రెండు చోట్ల గెలిచినా అన్ని పదవులు పోయాయి- ఏపీ పంచాయితీ ఎన్నికల్లో అరుదైన ఘటన

ఆంధ్రప్రదేశ్‌ పంచాయితీ ఎన్నికల్లో ఓ అభ్యర్ధి రెండుచోట్ల వార్డు సభ్యుడిగా గెలిచి, ఉపసర్పంచ్‌ కూడా అయ్యాక అన్ని పదవులు కోల్పోవాల్సి వచ్చిందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రులో పెనుమత్స వెంకట రామకృష్ణంరాజు అనే అభ్యర్ధి 4, 5 వార్డుల్లో పోటీ చేశారు. రెండుచోట్లా ప్రత్యర్థుల్ని చిత్తు చేసి మరీ గెలిచారు.

ఆ తర్వాత వార్డు సభ్యుల ద్వారా పరోక్ష పద్ధతిన జరిగే ఉప సర్పంచ్‌ ఎన్నికల్లోనూ పోటీపడి ఉప సర్పంచ్‌గానూ గెలుపొందారు.

పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానానికి మించి పోటీ చేయకూడదు. కానీ రామకృష్ణంరాజు రెండు వార్డుల్లో పోటీ చేయడమే కాకుండా రెండుచోట్లా గెలిచారు.

నిబంధనలకు విరుద్ధంగా రామకృష్ణంరాజు ఎన్నికల్లో గెలిచారంటూ ఆయనపై పోటీ చేసిన ప్రత్యర్ధులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు వేస్తే ఉపసంహరణ తేదీ నాటికి ఏదో ఒకచోట విత్‌డ్రా చేసుకోవాలి. లేదంటే ఆ అభ్యర్ధి వేసిన అన్ని నామినేషన్లు రద్దవుతాయి.

చింతపర్రులో పోటీ చేసిన అభ్యర్థితోపాటు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన ఉద్యోగికి సైతం అవగాహన లేకపోవడంతో రామకృష్ణంరాజుకు రెండుచోట్లా పోటీకి అవకాశం ఇచ్చారు.

దీనిపై జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో విచారణ జరిపించిన ఎన్నికల కమిషన్‌ ఆ రెండు వార్డుల ఎన్నికలతో పాటు ఉప సర్పంచ్‌ ఎన్నికనూ రద్దు చేసింది. దీంతో ఆయన రెండు వార్డు పదవులతో పాటు ఉప సర్పంచ్‌ పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది.

స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్టు గుర్తించిన కలెక్టర్‌ ఆయన్ను సస్పెండ్‌ చేసినట్టు తెలిసిందని సాక్షి కథనం పేర్కొంది.

చింతపర్రు గ్రామ పంచాయతీలో 4, 5 వార్డులతోపాటు ఉప సర్పంచ్‌ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కాకాణి గోవర్దన్‌ రెడ్డి

నిమ్మగడ్డపై విచారణకు ప్రివిలేజ్‌ కమిటీ నిర్ణయం

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విచారణ చేపట్టాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించినట్లు కమిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్దన్‌ రెడ్డి చెప్పారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

బుధవారంనాడు వర్చువల్ సమావేశం నిర్ణయించిన ప్రివిలేజ్‌ కమిటీ విచారణకు నిమ్మగడ్డ అందుబాటులో ఉండాలని శాసన సభ కార్యదర్శి ద్వారా నోటీసులు పంపిస్తున్నామని, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని, వీలయినంత త్వరగా విచారణ పూర్తి చేస్తామని కాకాణి పేర్కొన్నారని ఈ కథనం వెల్లడించింది.

ఫిబ్రవరి 6న తనను హౌస్ అరెస్ట్ చేయాల్సిందిగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. బుధవారం(మార్చి 18) కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్దన్ రెడ్డి ఆయన ఫిర్యాదును పరిశీలించి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు,16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఎస్‌ఈసీ ఆదేశించారు.

దీనిపై పెద్దిరెడ్డి కోర్టుకు వెళ్లడంతో నిమ్మగడ్డ ఆదేశాలు చెల్లవని కోర్టు తేల్చి చెప్పింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతినిచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Police to Chandrababu's sister's house,Security personnel lodge complaint
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X