West Bengal Assembly Elections 2021 Assam Assembly Elections 2021 amit shah new delhi అమిత్ షా న్యూఢిల్లీ
ప్రజలకు అన్నీ తెలియనివ్వం: బెంగాల్‌లో 200 సీట్లలో విజయ ఢంకా: అమిత్ షా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. దేశ రాజధానిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రక్రియ ముగిసిన మరుసటి రోజే ఆయన మీడియా ముందుక రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీకి సానుకూలంగా ఓట్లు పడినట్లు ఆయన చెప్పారు. ఇదే పరిస్థితి మిగిలిన అన్ని విడతల పోలింగ్‌లోనూ కనిపిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.

ఒక్క ప్రాణం కూడా పోలేదు..
ఈ రెండు రాష్ట్రాల్లోని సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో కొనసాగిన పోలింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా సాగిందని, ఏ ఒక్క ప్రాణం కూడా పోలేదని అమిత్ షా అన్నారు. ఈ రెండు చోట్ల ఇదివరకెప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం నమోదు కావడం.. ఓటర్లలో ఉన్న ఉత్సాహాన్ని చూపుతోందని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెప్పారు. ఆ వ్యతిరేకతతోనే ప్రజలు తృణమూల్‌ను ఓడించాలని నడుం బిగించారని, ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని అన్నారు.

200 స్థానాలు మావే..
పశ్చిమ బెంగాల్‌లో 200ల స్థానాలను తాము గెలుచుకోబోతోన్నామని అమిత్ షా అన్నారు. ప్రత్యేకించి- మహిళలందరూ బీజేపీకే పట్టం కట్టారని ఆయన వ్యాఖ్యానించారు. బెంగాలీ మహిళా ఓటర్లకు తాను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చెప్పారు. బూత్ స్థాయి పార్టీ వర్కర్లు, నాయకులతో చర్చించిన తరువాతే.. తాము ఈ నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. తొలి విడతలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. 26కు పైగా సీట్లల్లో బీజేపీ అభ్యర్థులు గెలవబోతోన్నారని చెప్పారు. అలాగే- 47 స్థానాలకు తొలి విడత పోలింగ్ నిర్వహించిన అస్సాంలో 37 చోట్ల తాము గెలవబోతున్నామని అమిత్ షా అన్నారు.

అన్నీ బయటపెట్టలేం
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ కూటమిలో భాగస్వామ్య పక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తనను కలుసుకోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. అన్నీ బయటపెట్టలేమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం జ్యుడీషియరీ విచారణకు ఆదేశించడాన్ని సబబు కాదని అన్నారు.

అస్సాంలో వ్యతిరేక పవనాల్లేవ్
అస్సాంలో తాము మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అమిత్ షా అన్నారు. ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ పనితీరు పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు లేవని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఇప్పటిదాకా ఏర్పడిన సర్వేలను తాము పెద్దగా పట్టించుకోవట్లేదని అమిత్ షా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో పనిచేసే మీడియా చేసిన సర్వేలు వాస్తవాలను ప్రతిఫలింపజేయట్లేదని ఆయన తేల్చి చెప్పారు. ఢిల్లీలో పనిచేసే మీడియా ప్రతినిధులు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.