ఆ హామీని నెరవేరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ప్రశాంత్ కిషోర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీకి ఘోర పరాజయం ఎదురైన తర్వాత రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా స్పందించారు. తన పార్టీ జన్‌సూరాజ్ ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ఒక రోజు మౌన ఉపవాసం చేయనున్నట్లు వెల్లడిచారు. అంతే కాకుండా జేడీయూ పార్టీకి ఒక పెద్ద సవాల్ విసిరారు.
వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే: ప్రశాంత్ కిషోర్
ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందు మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. ప్రభుత్వం మార్పును తీసుకురావడంలో తాను విఫలమైనందుకు క్షమాపణ చెప్పారు. "మేము చాలా సానుకూలంగా ప్రయత్నించాం. కానీ ప్రభుత్వాన్ని మార్చడంలో మేము విఫలమయ్యాము. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో నేను విఫలమయ్యాను, కాబట్టి ఈ వైఫల్యానికి పూర్తి నింద నాదే. మేము ఆత్మపరిశీలన చేసుకుంటాము. నా ప్రయత్నాల్లో విఫలమైనందుకు చింతిస్తున్నాను. ఈ రోజు నేను 'మౌన ఉపవాసం' పాటిస్తాను," అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలలో 238 స్థానాల్లో పోటీ చేసింది, కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తాము చేసిన నిజాయితీ ప్రయత్నం పూర్తిగా విఫలమైందని, వ్యవస్థాపరమైన మార్పు కాదు కదా, కనీసం అధికార మార్పును కూడా తీసుకురాలేకపోయామని ప్రశాంత్ కిషోర్ అంగీకరించారు.

2 లక్షల హామీపై ప్రశాంత్ కిషోర్ సవాల్
అయితే ప్రశాంత్ కిషోర్ రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. కానీ ఎన్నికల ముందు మరో ప్రకటనపై స్పందిస్తూ... జేడీయూకు సవాల్ విసిరారు. "ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా జేడీయూ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 1.5 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు బదిలీ చేసి.. తాము ఓట్లు కొని గెలవలేదని నిరూపిస్తే, నేను ఎలాంటి షరతులు లేకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటాను." అని ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. అధికార ఎన్డీఏ కూటమి (బీజేపీ, జేడీయూ) 202 సీట్లతో (జేడీయూ 85, బీజేపీ 89) ఘన విజయం సాధించడానికి గల కారణాన్ని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు.
జేడీయూ వ్యూహం: సుమారు 1.5 కోట్ల మంది మహిళలకు రూ. 2 లక్షలు (రుణం రూపంలో) ఇస్తామని పాలక ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే ఎన్డీఏకు ఇంత పెద్ద మెజారిటీ వచ్చిందని ఆయన ఆరోపించారు. దీని కోసం ప్రభుత్వ అధికారులు, జీవిక దీదీలను డ్యూటీలో పెట్టి, ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే రుణాలు వస్తాయని ప్రజలకు చెప్పారన్నారు. ప్రజలు తమ భవిష్యత్తును అమ్ముకోరని, అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్‌లో తొలిసారిగా ఒక ప్రభుత్వం రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇవ్వడం వల్లే మెజారిటీ వచ్చిందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications