
పక్కా ప్లాన్ - వేట మొదలు పెట్టిన ప్రశాంత్ కిశోర్..!!
పాట్నా: ప్రశాంత్ కిశోర్.. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. మొన్నటి వరకు తెర వెనుక ఉంటూ రాజకీయాలను నడిపించిన ఈ రాజకీయ వ్యూహకర్త ఇక స్వయంగా తానే ముందుకొచ్చారు. ముందడుగు వేశారు. రాజకీయ వేట మొదలు పెట్టారు. ఈ విషయంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసినట్టే.. ప్రశాంత్ కిశోర్ బిహార్‌లో అదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఏడాదిన్నర పాటు జనం మధ్యే..
జన్ సురాజ్ పేరుతో 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్రను చంపారన్ జిల్లాలోని భితిహర్వాలో గల గాంధీ ఆశ్రమం వద్ద ప్రారంభించారు. 12 నుంచి 15 నెలల్లో బిహార్‌లోని అన్ని పల్లెలు, పట్టణాల గుండా ఈ పాదయాత్ర సాగుతుంది. ఏడాదిన్నర పాటు ఆయన జనం మధ్యే గడపబోతోన్నారు. తొలి రోజు ఆయన 10 కిలోమీటర్ల మేర నడవనున్నారు. భితిహర్వాలో మొదలు పెట్టిన ఈ పాదయాత్ర రాత్రి 8 గంటలకు గౌనాహాలో ముగుస్తుంది. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. భితిహర్వా, సెర్వా శ్రీరామ్‌పూర్, బేరియా, రామ్ పూర్వబాగ్, పార్సా, గౌనాహా బజార్ మీదుగా పాదయాత్ర చేస్తారాయన.

మేధావులు మౌనంగా ఉంటే..
పాదయాత్ర ప్రారంభించిన అనంతరం ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. బిహార్‌లో మార్పును తీసుకుని రావాలనే లక్ష్యంతో అడుగు వేస్తోన్నానని చెప్పారు. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న బిహార్‌ను బాగు చేయాల్సిన బాధ్యతను స్వీకరించానని అన్నారు. ఓ సగటు బిహారిగా తన రాష్ట్రాన్ని తాను అగ్రగామిగా చూడాలనుకుంటోన్నానని వ్యాఖ్యానించారు. మేధావులు మౌనంగా ఉంటే పిచ్చివాళ్లు రాజ్యాలను ఏలుతారని ప్లేటో శతాబ్దాల కిందటే చెప్పారని గుర్తు చేశారు.

అట్టడుగు స్థాయిలో రాజకీయ చైతన్యం..
గ్రామస్థాయిలో ప్రతి పౌరుడిలోనూ రాజకీయ చైతన్యాన్ని తీసుకొస్తానని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో రాణించగల సత్తా ఉన్న వారిని ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా బిహార్‌లో ఎలాంటి మార్పు రాలేదని, దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. బిహార్‌ను ఈ దుస్థితి నుంచి బయటికి తీసుకురావాలనేదే తన పాదయాత్ర ప్రధాన లక్ష్యమని, దాన్ని సాధించేంత వరకు విశ్రమించబోనని చెప్పారు.

భావసారూప్యం గల వారు మద్దతు ఇవ్వాలి..
తన లక్ష్యాన్ని అందుకోవడానికి..సరైన ఆలోచన విధానం, భావసారూప్యం గల ప్రతి ఒక్కరు తనకు మద్దతు ఇవ్వాలని ప్రశాంత్ కిశోర్ విజ్ఞప్తి చేశారు. ఒక కొత్త బిహార్‌ను రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పారు. అట్టడుగు స్థాయిలో సామర్థ్యం గల వారిని గుర్తించి, కొత్త రాజకీయ వ్యవస్థను రూపొందిస్తానని స్పష్టం చేశారు. వారిందరినీ ఒకే ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తానని వివరించారు.

ప్రాధాన్యతలతో..
స్థానిక సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి గల అవకాశాలపై ఓ సమగ్ర నివేదికను రూపొందిస్తానని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. నగరాలు, పంచాయతీల ప్రాధాన్యతలను గుర్తించడంతో పాటు వాటిని అభివృద్ధి చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తానని అన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక న్యాయం వంటి కీలక రంగాలలో నిపుణుల సలహాలు, సూచనలను తీసుకుంటానని వివరించారు.