శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడికి ఎబోలా లక్షణాలు.. గాంధీ ఆస్పత్రికి తరలింపు..
ప్రపంచ దేశాల్ని ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రకటించింది. అయితే తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడికి ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి ప్రభుత్వం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా అతడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడ్ని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఆ రోగి నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని వాటిని హైదరాబాద్ లోని సీసీఎంబీకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ఆ శాంపిల్స్ ను మహారాష్ట్రలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి కూడా పంపిస్తామని తెలిపారు. ఈ టెస్టు ఫలితాలు రెండు మూడు రోజుల్లో రావచ్చని చెబుతున్నారు. రోగిని 21 రోజులపాటు ఐసోలేషన్ లో ఉంచుతామని వివరించారు.
మరోవైపు భారత్ లోనూ ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలో ఎబోలా వైరస్ అనుమానితులను గుర్తించారు. కాంగో, ఇథియోపియా, ఉగాండా దేశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఎబోలా అనుమానితులుగా పరిగణించి గృహ నిర్భందంలోనే ఉంచామని జిల్లా కలెక్టర్ అభిజిత్ సింగ్ తెలిపారు.

ఇక కాంగో, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల్లో ప్రయాణించినా లేదా ఆ దేశాల మీదుగా వచ్చిన ప్రయాణికులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications