మోడీకి షాక్: బీహార్‌లో లాలు - నితీష్‌లదే విజయం
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. 243 స్థానాలున్న బీహార్‌లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఐదు అంచెల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 8న జరగనుంది.
బీహార్లో ఇండియా టుడే అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో జెడియు, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమికి 116 నుంచి 132 స్థానాలు లభించే అవకాశం ఉందని ఈ ఛానల్ తరఫున సి ఓటర్ సంస్థ అంచనా వేసింది.

బిజెపి, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం పార్టీ కూటమికి 94-100 స్థానాలు రావొచ్చు. మహాకూటమికి 43 శాతం, ఎన్డీయే కూటమికి 40 శాతం, ఇతరులకు 17 శాతం ఓట్లు రావొచ్చు. సెప్టెంబర్ మొదటి వారాల్లో వివిధ నియోజకవర్గాలలో పదివేల మందికి పైగా నుంచి అభిప్రాయ సేకరణ చేశారు.
మహా కూటమి గెలిస్తే నితీష్ సీఎం
ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ముందంజలో 53 శాతం మంది నితీష్ కుమార్ పేరును, 18 శాతం మంది బిజెపి నేత సుశీల్ మోడీ పేరును, లాలూ, శత్రఘ్నుసిన్హాల పేరును చెరో 5 శాతం మంది చెప్పారు. ప్రస్తుత శాసన సభ్యులను మార్చాలని 70 శాతం మంది అభిప్రాయపడ్డారు.
బిహార్ అభివృద్ధికి బిజెపి కూటమి పాటుపడుతుందని 36 శాతం చెబితే, 25 శాతం మంది మహాకూటమికి ఓటేశారు. బీహార్ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని 52 శాతం మంది, కేంద్రం అని 35 శాతం మంది చెప్పారు.
మేం నచ్చితే మాకు: నితీష్
తమ సర్కార్ పని తీరు ఎవరికైతే నచ్చుతుందో వారే తమకు ఓటేస్తారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన సందర్భంగా జేడీ(యు) అధినేత మాట్లాడారు. ములాయం కూటమి నుంచి వైదొలగడంపై స్పందిస్తూ... సొంత నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉందన్నారు.
బీహార్‌కే పరిమితం కాదు: లాలూ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికలు దేశానికి జరగబోయే ఎన్నికలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చురక అంటించారు. ఈ ఎన్నికలు దేశం మొత్తాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.












Click it and Unblock the Notifications