ఆ ఉపాధ్యాయుడి కోసం స్టేజి దిగొచ్చిన రాష్ట్రపతి ముర్ము(వీడియో)
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని దేశం సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశం నలుమూలల నుంచి వచ్చిన 45 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ దివ్యాంగ ఉపాధ్యాయుడికి అవార్డు అందించేందుకు రాష్ట్రపతి ముర్ము వేదిక దిగి వచ్చారు. రాష్ట్రపతి చర్యతో సభా ప్రాంగణమంతా హర్షద్వానాలు, చప్పట్లతో మారుమోగింది.

స్టేజి దిగి ఆ ఉపాధ్యాయుడికి అవార్డు అందించిన రాష్ట్రపతి
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ నేగి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో అవార్డు స్వీకరించేందుకు ఆయన పేరును పిలిచారు. అయితే, దివ్యాంగుడైన ప్రదీప్ నేగిని చూడగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టేజి పైనుంచి దిగి కిందకు వచ్చారు. ఊతకర్రల సాయంతో అక్కడికి చేరుకున్న ఆయనను అభినందించి అవార్డును అందజేశారు రాష్ట్రపతి.
రాష్ట్రపతి చర్యను అభినందిస్తూ హర్షధ్వానాలు
కాగా, గొప్ప మనసును చాటుకున్న రాష్ట్రపతిని అభినందిస్తూ చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాష్ట్రపతి ముర్మ వినయ, విధేయతలు, దయా గుణానికి ఈ ఘటనే నిదర్శనం. ఆదర్శవంతమైన ప్రజావిలువలకు రాష్ట్రపతి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కేంద్రమంత్రి అభినందించారు. నెటిజన్లు కూడా రాష్ట్రపతిని కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.

గొప్ప ఉపాధ్యాయులు స్ఫూర్తినిస్తారంటూ రాష్ట్రపతి
కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను స్మరించుకుంటూ.. వారు తనకు చదువు చెప్పడమే కాకుండా ప్రేమను, స్ఫూర్తిని అందించారని అన్నారు. విద్యార్థులకు సైన్స్, పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించడం ఉపాధ్యాయుల కర్తవ్యమని రాష్ట్రపతి అన్నారు. ప్రకృతిలో కనిపించే వాస్తవ-ప్రపంచ ఉదాహరణల ఉపయోగంతో, సమర్థవంతమైన ఉపాధ్యాయులు కష్టమైన భావనల వివరణను సరళీకృతం చేయవచ్చు అని అన్నారు. "మధ్యస్థుడైన ఉపాధ్యాయుడు చెబుతాడు; సద్గురువు వివరిస్తాడు; ఉన్నత ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని ఇస్తాడు" అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. పిల్లలు ప్రశ్నలు లేవనెత్తడం, సందేహాలు వ్యక్తం చేయడం అలవాటును పెంపొందించడానికి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని రాష్ట్రపతి కోరారు.












Click it and Unblock the Notifications