నేడు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీ... కారణం అదే ?
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కూటమికి చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల కీలక సమావేశం నేడు న్యూఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. మొత్తంగా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరుకానున్నారు.
ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. అలానే పలువురు బీజేపీ ముఖ్య నేతలు సైతం హాజరు అవుతారని తెలుస్తోంది. పాలనాపరమైన అనుభవాలను పంచుకోవడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయం పెంచే దిశగా చర్చలు జరగనున్నాయని సమాచారం.

ఆమోదించబోయే కీలక తీర్మానాలు..
ఈ సమావేశంలో భారత రక్షణ దళాలు నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్" విజయవంతం కావడాన్ని అభినందిస్తూ ప్రత్యేక తీర్మానం చేయనున్నారు.
జనాభా లెక్కింపులో కుల గణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఎన్డీయే ముఖ్యమంత్రుల అభినందన తీర్మానం.
ప్రధాన చర్చాంశాలు..
ఎన్డీయే రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పాలనా విధానాలు.
కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రాల అనుసరణా విధానాల సమీక్ష.
పీఎం అవాస్ యోజన, జల జీవన్ మిషన్, ఆరోగ్య భారత్ వంటి పథకాల పురోగతిపై సమీక్ష.
ఐటి వినియోగం ద్వారా పాలనలో పారదర్శకత, లబ్దిదారుల గుర్తింపు విధానాలు.
విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై రాష్ట్రాల ప్రగతికి సంబంధించి విజ్ఞప్తుల సమీక్ష.
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి మొదటి వార్షికోత్సవానికి సంబందించిన కార్యాచరణ.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించబోయే కార్యక్రమాలు.
అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా "లోక్‌తంత్ర హత్యా దివస్" పేరిట నిర్వహించబోయే అవగాహన కార్యక్రమాలు.
ఈ సమావేశం ద్వారా ఎన్డీయే పాలిత రాష్ట్రాలు పరస్పర సహకారం పెంచుకుని.. కేంద్రం సమన్వయంతో మరింత సమర్థవంతమైన పాలనను అందించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సమావేశం గురించి చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications