ప్రధానే ఆర్దిక మంత్రిగా - పద్దుల తయారీ, సభ ముందుకు..!!
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ కు కసరత్తు కొనసాగుతోంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించనుంది. ఈ సారి బడ్జెట్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. సామాన్యుల నుంచి ఉద్యోగులతో పాటుగా పారిశ్రామిక దిగ్గజాలు బడ్జెట్ వైపు చూస్తున్నాయి. మరోసారి మోదీ మార్క్ బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టే వేళ పద్దుల తయారీలో ప్రధాని నిర్ణయాలే కీలకంగా ఉంటాయి. ప్రధానులే ఆర్దిక మంత్రులుగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. మూడో సారి మోదీ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత పూర్తిగా 12 నెలల కాలానికి ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ కావటంతో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. కాగా, బడ్జెట్ ఆర్దిక మంత్రులే ప్రవేశ పెట్టినా.. తయారీలో మాత్రం ప్రధానుల ముద్ర స్పష్టంగా ఉంటుంది. అసలు ప్రధానులే ఆర్దిక మంత్రిగా సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భం పార్లమెంట్ లో అయిదు సార్లు చోటు చేసుకుంది. ఆ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎన్నో ఆసక్తికర అంశాలకు తమ బడ్జెట్ లో ప్రధానులు స్థానం కల్పించారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రధానులు
తొలి ప్రధాని నెహ్రూ 1958 లో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రతిపాదించిన ప్రధానిగా తొలి సారి రికార్డు నెలకొల్పారు. ఆ సమయంలో ముంద్రా స్కాం లో నాటి ఆర్దిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా తో ప్రధాని స్వయంగా బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టాల్సి వచ్చింది. ఆర్దిక మంత్రిగా బడ్జెట్ పైన సుదీర్ఘ కసరత్తు తరువాత సభ ముందుకు వచ్చారు. అదే విధంగా ప్రధానిగా ఉంటూనే ఆర్దిక మంత్రిగా పని చేసిన మొరార్జీ దేశాయ్ ఇప్పటి వరకు అధిక సంఖ్యలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన పేరు మీదనే ఆ రికార్డు కొనసాగుతోంది.
మోరార్జీ రికార్డు
మొరార్జీ దేశాయ్ పది సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించారు. 1959 నుంచి 1963 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొరార్జీ ఎనిమిది వార్షిక బడ్జెట్లు, రెండు తాత్కాలిక బడ్జెట్లు సభ లో ప్రవేశ పెట్టారు. తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ సైతం బడ్జెట్ ను సమర్పించారు. 1970 లో ఇందిరాగాంధీ బడ్జెట్ ను సభలో సమర్పించారు. ఇక, రాజీవ్ గాంధీ సైతం ఆర్దిక శాఖను స్వయంగా పర్యవేక్షించారు. బోఫోర్స్ కుంభకోణం వెలుగు చూడటంతో అప్పటి ఆర్థిక మంత్రిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌ను తొలగించారు. దీంతో ఆర్థిక మంత్రిగా 1987-88 సంవత్సర బడ్జెట్‌ను రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు.
మన్మోహన్ హయాంలో
ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్ లోఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన సమర్పించిన 1991 బడ్జెట్ భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు మలుపుగా నిలిచింది. ఆయన హయాంలోనే ఆర్దిక సంస్కరణలకు నాంది పలికారు.
1994లో ఆయన సమర్పించిన బడ్జెట్‌లో సేవా పన్ను ప్రవేశపెట్టారు. ఇక.. మోదీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రస్తుత ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ప్రవేశ పెడుతున్న బడ్జెట్ 8వ సారి. ఈ సారి బడ్జెట్ పైన సామాన్యులతో పాటుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా వేచి చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications