ప్రియాంకా గాంధీ వారసురాలు వచ్చేసింది.. మామతో కలిసి!!
జైపూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 96వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా రాజస్థాన్‌కు చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఇది ముగియాల్సి ఉంది.

రాజస్థాన్‌లో..
ఈ తెల్లవారు జామున 6 గంటలకు రాజస్థాన్‌లోని బూందీలో యాత్రను మొదలు పెట్టారు రాహుల్ గాంధీ. అరగంట తరువాత ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఇందులో భాగస్వామి అయ్యారు. రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రం కావడం వల్ల- పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. బూందీ పట్టణం మొత్తం జనమయమైంది. ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు, బ్యానర్లు, విస్తృతంగా కనిపించాయి.

అపూర్వ ఆదరణ..
రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా కలిసి నడవటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. గాంధీ కుటుంబానికి వారు జిందాబాద్ కొట్టారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు రాహుల్- ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి నడిచారు. వారికి అపూర్వ ఆదరణ లభించింది. దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు. పలుచోట్ల పూల వర్షాన్ని కురిపించారు.

ప్రత్యేక ఆకర్షణగా..
కాగా- దీనికి మరింత ప్రత్యేక ఆకర్షణగా.. ప్రియాంకాగాంధీ వాద్రా-రాబర్ట్ వాద్రా కుమార్తె మిరాయా వాద్రా కూడా భారత్ జోడో యాత్రలో పాలుపంచుకున్నారు. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం మిరాయా జోడో యాత్రలో పాల్గొన్నారు. మామను కలిసి బెస్ట్ విషెస్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరిస్తూ ముందుకుసాగారమె. పెద్దగా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని మిరాయా జోడో యాత్రలో పాల్గొనడంతో ఆమెను చూడ్డానికి స్థానికులు ఎగబడ్డారు.

మీడియాకు దూరంగా..
ప్రియాంకాగాంధీ వాద్రా-రాబర్ట్ వాద్రా దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు రేహాన్, కుమార్తె మిరాయా ఉన్నారు. వారిద్దరూ మీడియా కంటికి కనిపించడం చాలా అరుదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప వారిద్దరూ మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. దీనికి భిన్నంగా మిరాయా వాద్రా- జోడో యాత్రలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తల్లిదండ్రులు, మేనమామతో కలిసి ఆమె ఉత్సాహంగా నడిచింది.

హిమాచల్‌లో గెలిచిన ఉత్సాహం..
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు తాజా పరిణామం మరింత ఉత్సాహాన్ని కలిగించినట్టయింది. 68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్ అసెంబ్లీలో 40 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. బీజేపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. 25 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సుఖ్వీిందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. భారత్ జోడో యాత్రకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించిన రాహుల్ గాంధీ ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications