సాహితీవేత్త హత్య కేసు నిందితుడు ఇతనే (ఫోటో)
బెంగళూరు: ప్రముఖ కన్నడ సాహితీవేత్త ప్రోఫసర్ డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసులో పోలీసు అధికారులు కీలక సమాచారం సేకరించారు. ఈ హత్య కేసులో హంతకుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు రుద్ర పాటిల్ (31) అని శుక్రవారం సీఐడి అధికారులు చెప్పారు.
అతని ఫోటోను సైతం మీడియాకు విడుదల చేశారు. రుద్ర పాటిల్ కోసం కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసుతో పాటు గోవింద్ పన్సారే, నరేంద్ర దబోల్కర్ ల హత్య కేసులతో రుద్ర పాటిల్ కు సంబంధం ఉందని సీఐడి అధికారులు భావిస్తున్నారు.
కన్నడ సాహితీవేత్త, మాజీ ఉప కులపతి డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి (77)ని దారవాడలోని ఆయన ఇంటిలో ఆగస్టు 30వ తేది ఆదివారం ఉదయం 8.40 గంటల సమయంలో తుపాకితో కాల్చి హత్య చేశారు. ఈ కేసు సీఐడికి అప్పగించారు. తరువాత ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

హంతకులను పట్టిస్తే రూ. ఐదు లక్షలు బహుమానం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. సీఐడి అధికారులతో పాటు సీబీఐ, ఎన్ఐఏ అధికారులు రుద్ర పాటిల్ కోసం గాలిస్తున్నారు. రుద్ర పాటిల్ పూర్తి వివరాలను అధికారులు సేకరించారు.
ఇతను మహారాష్ట్రలోని సాంగ్లీలోని మారుతి రోడ్డులో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. సాంగ్లీలోని జోషి గల్లీలోని దత్తకృపా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ నెంబర్ 8లో నివాసం ఉంటున్నాడు. ఇతని కోసం రెండు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు.
రుద్ర పాటిల్ మీద ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని సీఐడి అధికారుల విచారణలో వెలుగు చూసింది.
డాక్టర్ కలబుర్గి హత్య జరిగిన రోజు రుద్ర పాటిల్ బెల్గాంలో మకాం వేశాడని మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు పక్కా ఆధారాలు సేకరించి కర్ణాటక పోలీసులకు అందించారు.












Click it and Unblock the Notifications