రాజకీయ పార్టీల ఉచిత హామీలు తీవ్రమైన సమస్య: కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితంగా అది ఇది ఇస్తామని హామీ ఇవ్వడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చే 'ఉచిత' వాగ్ధానాలు తీవ్రమైన సమస్య అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిని ఎలా కట్టడి చేస్తారో సమాధానం చెప్పాలంటూ ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్ధానాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఎన్నికలకు ముందు ఉచితాలతో మభ్యపెట్టే పార్టీల గుర్తులను సీజ్ చేసేలా, పార్టీ రిజిస్ట్రేషన్ల రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

రాజకీయ పార్టీల ఉచిత హామీలను దీన్ని చట్టబద్ధంగా ఎలా నియంత్రించాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లోగా ఇది సాధ్యమవుతుందా? ఉచితాల బడ్జెట్ సాధారణ బడ్జెట్‌ను మించిపోయింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితిని నిరోధించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలంటూ గతంలో ఎన్నికల సంఘానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతూ ఎన్నికల సంఘం కేవలం ఒక సమావేశాన్ని మాత్రమే నిర్వహించిందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూర్తి ఎన్వీ రమణ. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాగా, ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే ఉచితాలు ప్రకటించిన విషయం తెలిసిందే.