సమాజ్‌వాది పార్టీ స్టార్ క్యాంపెయినర్ల కొత్త జాబితాలో అనూహ్య నేతకు చోటు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వాతావరణం మరింత వేడెక్కుతోంది. దశలవారీగా పోలింగ్ ముగుస్తోన్నకొద్దీ- తరువాతి విడతలపై అన్ని రాజకీయ పార్టీలు కూడా దృష్టి సారించాయి. ఇప్పటిదాకా ముగిసిన విడతల్లో తమకు ఎన్ని అసెంబ్లీ స్థానాలు లభిస్తాయోనంటూ బేరీజు వేసుకుంటోన్నాయి. మిగిలిన దశల్లో నిర్వహించే పోలింగ్‌పైనా అదే ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి. దీనికి అనుగుణంగా తమ ఎన్నికల ప్రచార పర్వాన్ని రూపొందించుకుంటోన్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటిదాకా మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 10, 14, 20వ తేదీల్లో మొత్తం 172 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా నాలుగు విడతల పోలింగ్ మిగిలివుంది. 231 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఎన్నికలను ఎదుర్కొనబోయే నియోజకవర్గాల్లో జెండా పాతడానికి సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి.

ఇందులో భాగంగా- అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కొత్తగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుద చేసింది. ఈ జాబితాలో ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ (లోహియా) అధినేత శివ్‌పాల్ యాదవ్‌కు చోటు కల్పించింది. శివ్‌పాల్ యాదవ్.. అఖిలేష్‌కు సమీప బంధువు. ఆయన స్థాపించిన పార్టీతో సమాజ్‌వాది పొత్తు పెట్టుకుంది. శివ్‌పాల్ యాదవ్ పోటీ చేసిన నియోజవర్గానికి ఈ నెల 20వ తేదీన పోలింగ్ ముగిసింది.
దీనితో ఆయన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార బరిలో దిగారు. ఆయన పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు అఖిలేష్ యాదవ్. నిజానికి- తొలి విడత విడుదలైన సమాజ్‌వాది పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో శివ్‌పాల్‌కు చోటు లభించలేదు. ఆయన తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉన్నందున పేరును పరిశీలనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు మలి విడత లిస్ట్‌లో శివ్‌పాల్ పేరును చేర్చింది.
ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్య, రామ్‌గోపాల్ యాదవ్, కిర్మణయి నందా తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మిగిలన నాలుగు దశల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లను సమాజ్‌వాది పార్టీ ముమ్మరం చేసింది. బహిరంగ సభలు, రోడ్ షోలను నిర్వహించనుంది. అధికార భారతీయ జనతా పార్టీపై విమర్శనాస్త్రాల తీవ్రతను రెట్టింపు చేసింది. తాము అధికారంలోకి వస్తే- ఏం చేస్తామో ఓటర్లకు వివరిస్తూ ప్రచార పర్వాన్ని సాగిస్తోంది.












Click it and Unblock the Notifications