శివన్నకు, పునీత్‌కు ఆడపిల్లలే: పార్థివదేహానికి అంత్యక్రియలను నిర్వహించేది ఎవరో తెలుసా?
బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహానికి ఆదివారం ఉదయం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్యలో అంత్యక్రియలను నిర్వహించే అవకాశం ఉంది. కంఠీరవ స్టూడియోలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆయన తండ్రి రాజ్‌కుమార్, తల్లి పార్వతమ్మల సమాధులు అక్కడే ఉన్నాయి. వాటి పక్కనే పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను చేపట్టనున్నారు.

పెద్దకుమార్తె చివరి చూపు..
అమెరికా నుంచి పెద్దకుమార్తె ధృతి రాజ్‌కుమార్ రాక కోసమే ఇవ్వాళ కూడా పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహించలేదు. ఆ సాయంత్రం ఆమె బెంగళూరుకు వచ్చారు. తండ్రి పార్థివ దేహాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియానికి వెళ్లారు. తండ్రి కడసారి చూపునకు నోచుకున్నారు. అల్లారుముద్దుగా, గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రి- నిర్జీవంగా ఉండటాన్ని చూసి తల్లడిల్లిపోయారు. ఏకధాటిగా కన్నీరుమున్నీరయ్యారు. అలాగే లక్షలాదిమంది అభిమానులు తమ ఆరాధ్య నటుడి తుది వీడ్కోలు పలికారు.

6 గంటల వరకే..
కాగా- అభిమానుల కోసం పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని ఆదివారం తెల్లవారు జామున 6 గంటల వరకే సందర్శనకు అనుమతి ఇస్తారు. ఆ తరువాత అంత్యక్రియల ఏర్పాట్లు మొదలవుతాయి. అభిమానుల తాకిడి తీవ్రంగా ఉన్నందున.. 6 గంటల తరువాత వారిని నియంత్రించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనం మీద ఆయన పార్థివ దేహాన్ని ఉంచి.. ఊరేగింపుగా కంఠీరవ స్టూడియోకు తీసుకెళ్తారు. సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను నిర్వహిస్తారు.

ఇద్దరూ కుమార్తెలే..
పునీత్ రాజ్‌కుమార్‌కు ఇద్దరూ కుమార్తెలే. ధృతి రాజ్‌కుమార్, వందిత రాజ్‌కుమార్. అంత్యక్రియలను నిర్వహించే వీలు లేదు. అలాగే- పునీత్ పెద్దన్న శివరాజ్ కుమార్‌కు కూడా ఇద్దరూ కుమార్తెలే ఉన్నారు. వారి పేర్లు నివేదిత, నిరుపమ. వారికి కూడా అంత్యక్రియలను నిర్వహించడానికి వెసలుబాటు లేదు. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌కు ఇద్దరు కుమారులు. ఆయనకు కుమార్తెలు లేరు. వారి పేర్లు వినయ్ రాజ్‌కుమార్, యువరాజ్ కుమార్. వారిలో రాఘవేంద్ర పెద్ద కుమారుడు వినయ్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర..
కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు అంతిమ యాత్ర సాగుతుంది. ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ పార్థివ దేహాన్ని తీసుకొస్తారు. ఈ రెండింటి మధ్య సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంది. దారి పొడవునా ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు పోలీసులు. కొన్ని చోట్ల ఇనుప బ్యారికేడ్లను అమర్చారు. కంఠీరవ స్టూడియోలో.. తండ్రి రాజ్‌కుమార్ సమాధికి 125 అడుగులు, తల్లి పార్వతమ్మ సమాధికి 45 అడుగుల దూరంలో పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ దారి పొడవునా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications