Puneeth Rajkumar: తండ్రి పార్థివదేహాన్ని చూసి తల్లడిల్లిన కుమార్తె ధృతి: నుదుటిపై చెయ్యి పెట్టి..!
బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పెద్ద కుమార్తె ధృతి రాజ్‌కుమార్ కొద్దిసేపటి కిందటే కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. నగర శివార్లలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె తండ్రి పార్థివ దేహాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియానికి వచ్చారు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి- నిర్జీవంగా ఉండటాన్ని చూసి తల్లడిల్లిపోయారు. ఏకధాటిగా కన్నీరుమున్నీరుగా ఏడుస్తోన్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

అమెరికా నుంచి వచ్చిన పెద్దకుమార్తె
పునీత్ రాజ్‌కుమార్‌కు ఇద్దరు కుమార్తెలు. ధృతి రాజ్‌కుమార్, వందిత రాజ్‌కుమార్. ధృతి పెద్ద కుమార్తె. అమెరికాలో చదువుకుంటున్నారు. తండ్రి మరణ వార్త విన్న వెంటనే బెంగళూరు ప్రయాణం అయ్యారు. న్యూయార్క్ నుంచి నేరుగా ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తనిఖీలు పూర్తయిన తరువాత 2 గంటల సమయంలో బెంగళూరుకు బయలుదేరారు.

పెదనాన్నతో ఫోన్‌లో
సాయంత్రం 4:20 నిమిషాలకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అప్పటికే అక్కడ కొందరు కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో కలిసి కంఠీరవ స్టేడియానికి బయలుదేరారు. దారిలో ఆమె తన పెదనాన్న శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌తో ఫోనులో మాట్లాడారు. నాన్నను ఎందుకు కాపాడలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధృతి అడిగిన ఏ ప్రశ్నకు కూడా తమ వద్ద సమాధానం లేదని రాఘవేంద్ర రాజ్‌కుమార్ కన్నీరు పెట్టారు.

తండ్రి పార్థివేదేహం నుదుటిపై చెయ్యి పెట్టి..
కంఠీరవ స్టేడియానికి చేరుకున్న తరువాత.. ధృతిని సముదాయించడం ఎవరి తరం కాలేదు. తండ్రి పార్థివదేహాన్ని చూస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. ధృతి తండ్రి పార్థివదేహం వద్దకు చేరుకున్న సమయంలో తల్లి రేవతి అశ్విన్, చెల్లెలు వందిత, పెదనాన్న శివరాజ్ కుమార్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఆమె వెంటే ఉన్నారు. పార్థివదేహం వద్దకు వచ్చిన వెంటనే- మూసివుంచిన గ్లాస్ కవర్‌ను తొలగించారు. తండ్రి నుదుటి మీద చెయ్యి పెట్టి విలపించారు. కొద్దిసేపటి తరువాత ఆ కవర్‌ను మళ్లీ మూసివేశారు.

శోకసంద్రం..
చాలాసేపు ధృతి అక్కడే నిల్చుండిపోయారు. తల్లి అశ్విన్ రేవంత్ ఒడిలో తలను పెట్టి విలపించారు. పెదనాన్న శివరాజ్ కుమార్, హీరో నిఖిల్ కుమార్ గౌడ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ధృతి రాకతో కంఠీరవ స్టేడియంలో వాతావరణం మరింత బరువెక్కింది. ఆమెను చూసిన వేలాదిమంది అభిమానులు కంటతడి పెట్టారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయలేదు అభిమానులు. వర్షంలో తడుస్తూనే తమ ఆరాధ్య నటుడికి కడసారి వీడ్కోలు పలికారు.

ఆదివారమే అంత్యక్రియలు..
పునీత్ పార్థివ దేహానికి ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తామని తెలిపారు. కంఠీరవ స్టూడియోలో పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలను చేపడతారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్, తల్లి పార్వతమ్మల సమాధులు అక్కడే ఉన్నాయి. వాటి పక్కనే పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications