• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుంగనూరు ఆవులు: ‘మూడు అడుగులే ఉంటాయి కానీ ధర మాత్రం ఐదు లక్షలు.. దీని మూత్రం, పేడనూ అమ్ముతారు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పుంగనూరు ఆవులు పొట్టి, ముద్దుగా చూడగానే ఆకర్షిస్తాయి

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఆవులకు చాలా ఫేమస్. మిగతా చోట్ల పశువులు అంటే ఆవులు, గేదెలను కలిపి చూస్తారు.

కానీ చిత్తూరు జిల్లాలో గేదెల శాతం చాలా తక్కువ. వారికి పశుసంపద అంటే ఆవులే.

ఈ జిల్లాలో ఆవులు వైవిధ్యంగా ఉంటాయి. వీటిని పుంగనూరు ఆవులు అంటారు.

ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు.. ఇలా దేశవ్యాప్తంగా పేరుగాంచిన పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి.

ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది

పొట్టిగా, ముద్దుగా ఉంటాయి

పుంగనూరు ఆవులు పొట్టిగా, ముద్దుగా ఉంటాయి. వాటి రూపం చూడగానే ఆకర్షిస్తుంది. వీటిని మొదటిసారి చూసినవారు మాత్రం అవి ఆవులా, దూడలా అని తికమకపడుతుంటారు.

ఎందుకంటే పుంగనూరు ఆవులు మామూలు ఆవు దూడల సైజులో ఉంటాయి. కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది.

ఇవి 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. ఇవి 115 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి.

ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా, తోక మాత్రం నేలను తాకుతూ ఉంటుంది.

పుంగనూరు ఆవులు పొట్టి, ముద్దుగా చూడగానే ఆకర్షిస్తాయి

పాలల్లో ఔషధ గుణాలు

పుంగనూరు ఆవు పాలలో ఔషధ గుణాలు ఉంటాయని స్థానిక రైతులు విశ్వసిస్తారు.

''ఈ పాలు చాలా రుచిగా ఉంటాయి. మామూలు ఆవు పాలలో 3.5 శాతం వెన్న ఉంటే ఈ ఆవు పాలలో 6 నుంచి 8 శాతం వెన్న ఉంటుంది. ఈ పాలు సుగంధ వాసనలతో, ఆయుర్వేద గుణాలతో ఉంటాయి. ఈ పాలలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి’’ అని రైతు సుధాకర రెడ్డి బీబీసీతో చెప్పారు.

''తల్లి ఆవు, ఎద్దు ఒరిజినల్ బ్రీడ్ అయితే దూడ కూడా వంద శాతం ఒరిజినల్ వస్తుంది. వేరే రకంతో క్రాస్ బ్రీడ్ చేస్తే, మూడు తరాల తరువాత ఒరిజినల్ వస్తుంది.

చిన్న చెవులు, మూపురం, తోక నేలకు ఆనడం, గంగడోలు కిందకు రావడం, ముందు కాళ్లు పొడవుండి వెనక కాళ్లు పొట్టిగా ఉండటం వీటి లక్షణాలు. వీటిపైన నీళ్లు పోస్తే వెనక్కి వెళ్లిపోతాయి. అలాంటి లక్షణాలుంటే దాన్ని అసలైన పుంగనూరు ఆవుగా గుర్తించవచ్చు" అని రైతు రఘు వివరించారు.

పుంగనూరు ఆవులు

పోషణ ఖర్చు తక్కువ

''పుంగనూరు జాతి ఆవు సాధారణంగా మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. తోక నేలను తాకుతుంది. ఇది తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలలో ఉంటుంది. బాహ్యలక్షణాలే కాకుండా జన్యుపరమైన లక్షణాలు కూడా ఈ జాతిని నిర్ధారిస్తాయి" అని డాక్టర్ వేణు బీబీసీకి వివరించారు.

డాక్టర్ వేణు, చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న పశు పరిశోధనా కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా వ్యవహరిస్తున్నారు.

''రైతులు కూడా వీటిని తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఇవి తట్టుకుంటాయి. ఈ ఆవు పొట్టిగా ఉండి, చూడగానే ఆకర్షిస్తుంది. అందువల్ల వీటికి ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. కొంతమంది వీటిని పిల్లల్లాగా ఇళ్లల్లోనే పెంచుకుంటున్నారు" అన్నారాయన.

వీటి కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది.

వీటి పేడ, మూత్రం కూడా అమ్ముతారు

సంప్రదాయ వైద్యాన్ని పాటించేవారు ఈ ఆవు పాలకు బాగా ప్రాధాన్యం ఇస్తారు.

ప్రస్తుతం ఈ ఆవు మూత్రాన్ని లీటర్ పది రూపాయలకు కొంటున్నారు. పేడ కిలో ఐదు రూపాయలు.

సాధారణ ఆవులకు మూడు లక్షల వరకూ, మంచి జాతి ఆవులకు ఐదు లక్షల వరకూ ధర పలుకుతోందని రైతు రఘు బీబీసీకి చెప్పారు.

పుంగనూరు ఆవులు పొట్టి, ముద్దుగా చూడగానే ఆకర్షిస్తాయి

ఇవి అంతరించే ప్రమాదం ఉంది

ఒకప్పుడు చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఈ పశుజాతి ఆవులు ఇప్పుడు వందల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి.

వీటి పాల దిగుబడి తక్కువగా ఉంటుంది. విదేశీ ఆవుల పాల దిగుబడి ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ జాతి ఆవులకు బదులు ఎక్కువగా పాలిచ్చే ఆవు జాతులను పెంచుకుంటున్నారు.

''రైతులు బిజినెస్ మైండ్‌తో వెళ్లడం, ఈ ఆవుల గురించి పట్టించుకోకపోవడంతో ఈ జాతి కనుమరుగవుతోంది. వీటిని తిరిగి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వీటిని పెంచుతున్నామని" రఘు చెప్పారు.

పుంగనూరు

ఇంట్లో ఉంటే మంచిదనే సెంటిమెంట్

''వ్యాపార ధోరణితో వీటి విలువ తెలీక పోగొట్టుకున్నాం. అంతరించిపోతున్న జాతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గత మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం" అని సుధాకర్ రెడ్డి చెప్పారు.

"దేశవాళి జాతితో పోలిస్తే సంకరజాతి పశువుల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉండడం వల్ల వాటివైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో, క్రమేపి దేశవాళి ఆవులు అంతరించి పోతున్నాయి. అందులో ప్రధానమైనది పుంగనూరు జాతి ఆవు. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

వీటికి జబ్బులను తట్టుకునే గుణం ఎక్కువ. అంతే కాకుండా తక్కువ మేత మేస్తాయి. వీటిని తక్కువ ఖర్చుతో పెంచవచ్చు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుంటాయి’’ అని డాక్టర్ వేణు అన్నారు.

పుంగనూరు ఆవు ఇంట్లో ఉంటే మంచిదన్న సెంటిమెంటుతో కూడా కొందరు ఇప్పుడు ఈ ఆవులను పెంచుతున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అభిషేకంలో కూడా ఈ పాలను వాడుతున్నారు.

పుంగనూరు ఆవులు

ఈ జాతిని కాపాడాలంటే..

''వీటి సంఖ్యను పెంచాలంటే అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలల్లో వీటి వీర్యాన్ని అందుబాటులో ఉంచి, దేశవాళీ ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తే ఈ జాతి అభివృద్ధి చెందుతుంది.

వీటి వీర్యం సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. ఒరిజినల్ పుంగనూరు జాతి ఆవులకు వీర్యం ఎక్కిస్తే ఒరిజినల్ బ్రీడ్ వస్తుంది. ఇతర ఆవులకు ఎక్కించినప్పుడు కొన్ని లక్షణాలు తగ్గుతాయి" అని సుధాకర్ రెడ్డి చెప్పారు.

''ఈ జాతిని అభివృద్ధి చేయడం కోసం నాణ్యమైన ఎద్దుల నుంచి వీర్యాన్ని సేకరించి ప్రాసెస్ చేసి భద్రపరుస్తున్నాం. భద్రపరిచిన వీర్యాన్ని కృత్రిమ గర్భధారణకు ఉపయోగిస్తున్నాం. ఇలా సేకరించిన వీర్యాన్ని రైతులకు అందించి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నాం.

పుంగనూరు ఎద్దుల వీర్యం కావలసిన రైతులు వారి దగ్గర ఉన్న పుంగనూరు జాతి ఆవు ఫోటో, పశు వైద్యులు ధ్రువీకరించిన పత్రం, ఆధార్ కార్డుతో సహా మాకు దరఖాస్తు పెట్టుకోవాలి.

దాన్ని మేం పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకొని వారికి నాణ్యమైన పుంగనూరు జాతి వీర్యాన్ని 200 రూపాయలకు సరఫరా చేస్తాం. అయితే, దీని ఉత్పత్తి తక్కువగా ఉండటంతో కావలసినంత వీర్యాన్ని సరఫరా చేయలేకపోతున్నాం. కొంతమంది వ్యాపార దృష్టితో ఇతర దేశవాళీ ఆవులకు ఈ వీర్యాన్ని ఎక్కిస్తున్నారు. అలా చేస్తే నాసిరకం దూడలు పుడతాయి" అని డాక్టర్ వేణు వివరించారు.

పుంగనూరు ఆవులు

ఆవుల జాతి వృద్ధి కోసం ప్రయత్నాలు

ప్రస్తుతం పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న పశు పరిశోధనా కేంద్రంలో 200లకు పైగా పుంగనూరు ఆవులను సంరక్షిస్తున్నారు.

''అంతరించిపోతున్న పుంగనూరు జాతి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయల నిధుల విడుదలకు జీవో జారీ చేసింది. పులివెందుల దగ్గర ఏపీ కార్లలో మిషన్ పుంగనూరు ప్రాజెక్టు చేపడుతున్నారు. పుంగనూరు జాతి ఆవు ఎలా ఉంటుంది అనే దానిపై ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ డాక్యుమెంటరీ విడుదల చేయనుంది.

కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) ద్వారా గుంటూరులో ఈ బ్రీడ్ ఉత్పత్తిని ప్రారంభించాం. రీసెర్చ్‌ను అనుసరించి, మేము కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఈ బ్రీడ్‌ను పెంచుతున్నాం. మన రాష్ట్రంలో సుమారు 500 వరకు పుంగనూరు జాతి పశువులు ఉన్నాయి. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈ పొట్టి జాతి ఆవులు దాదాపు 10,000 వరకు ఉండొచ్చు" అని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో రీసెర్చ్ డైరెక్టర్ కె. సర్జన్ రెడ్డి బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Punganur cows: ‘Only three feet but the price is five lakhs .. Its urine and manure are also sold’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X