ఆ దేశ ద్రోహులను శిక్షించండి: ఢిల్లీ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
న్యూఢిల్లీ: దేశ ద్రోహులకు మద్దతు పలుకుతున్న వారిని శిక్షించండి అని ఢిల్లీ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ద్వారకాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రసంగించారు. ఢిల్లీ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని మోడీ విమర్శల వర్షం కురిపించారు.

ప్రజలకు కేంద్ర పథకాలను ఆప్ చేరనివ్వడం లేదు..
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వారికి చేరనివ్వకుండా అడ్డుకుంటోందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఇలాంటి ప్రతికూల రాజకీయాలు ఢిల్లీలో ఉండకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన, జన్ ధన్ యోజన, లాంటి అనేక కేంద్రప్రభుత్వ పథకాలను ఆప్ ప్రభుత్వం ప్రజలకు చేరనివ్వడం లేదని ప్రధాని మండిపడ్డారు. ఈ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న వారి సంఖ్య కొన్ని దేశాల జనభాల కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.

దేశ ద్రోహులను శిక్షించండి..
భారతదేశం చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి వేగంగా జరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. దేశం మారుతోంది.. ఇప్పుడు ఢిల్లీ కూడా మారాలి అని మోడీ వ్యాఖ్యానించారు. దేశ భద్రత కోసం తీసుకున్న పుల్వామా, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ లాంటి కేంద్ర ప్రభుత్వం చర్యలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఇలాంటి నాయకులను శిక్షించాలని మోడీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పండి..
సీఏఏపై ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నాయని విపక్ష పార్టీలను ప్రధాని దుయ్యబట్టారు. ఢిల్లీ ఓటర్ల వారి జమ్మిక్కులను తెలివిగా తిప్పికొడతారని అన్నారు. ఢిల్లీకి కూడా దేశ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కావాలని, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలు కాదని అన్నారు. ఆప్ తోపాటు ఇతర పార్టీలకు ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఢిల్లీలో అనధికారికంగా కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మంది ప్రజలకు న్యాయబద్ధంగా హక్కులు కల్పిస్తామని అన్నారు. ప్రత్యేక అభివృద్ధి బోర్డును కూడా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రసంగంలో మోడీ వివరించారు.












Click it and Unblock the Notifications