కాంగ్రెస్‌లో లుకలుకలు-హైకమాండ్‌ను కలవరపెడుతున్న పంజాబ్,ఛత్తీస్‌గఢ్-నాయకత్వ మార్పుకు రెబల్స్ డిమాండ్
ఓవైపు దేశవ్యాప్తంగా ఢీలా పడ్డ పరిస్థితి... మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అంతర్గత లుకలుకలు... ఇదీ కాంగ్రెస్ పార్టీ దుస్థితి. అంతర్గత కుమ్ములాటలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కొంపముంచాయి. జ్యోతిరాధిత్య సింధియా వర్గం పార్టీని వీడటంతో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రాజస్తాన్‌లో అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ ఫైట్ కూడా... మధ్యప్రదేశ్ సీన్ రిపీట్ అవుతుందేమోననే సంకేతాలు పంపించింది. కానీ ఆ గండం గట్టెక్కి కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని నిలుపుకోగలిగింది.ప్రస్తుతం పంజాబ్,ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి.

పంజాబ్ సీఎం రాజీనామాకు రెబల్స్ డిమాండ్
పంజాబ్‌లో నవజోత్ సింగ్ సిద్దూను పీసీసీ చీఫ్‌గా నియమించాక పార్టీలో అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి. ముఖ్యంగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తూ నలుగురు మంత్రులు,కొంతమంది ఎమ్మెల్యేలు పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ హరీష్ రావత్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల నాటికి అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. కానీ హరీశ్ రావత్ వారి ప్రతిపాదనను తిరస్కరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికలు అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే జరుగుతాయని... అందులో ఎటువంటి మార్పు ఉండబోదని తేల్చి చెప్పారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సిద్దూ వర్గానికి చెందిన నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై రావత్ స్పందించారు. అది నిజమేనని... అయితే సిద్దూ ఆ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ లైన్‌ను దాటి చేసే కామెంట్లను కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని సిద్దూతో చెప్పానన్నారు.

పంజాబ్‌లో నాయకత్వ మార్పు ఉంటుందా?
పంజాబ్ కాంగ్రెస్ రెబల్స్ డిమాండ్‌పై కెప్టెన్ అమరీందర్ సింగ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. 'ఇప్పటికైతే పంజాబ్ నాయకత్వ మార్పు కోరుతూ కాంగ్రెస్ నాయకులెవరూ నాకు వినతిపత్రం ఇవ్వలేదు. మీడియా వర్గాల నుంచే ఈ వార్తలు వింటున్నాను తప్ప అలాంటిదేమీ లేదు. పార్టీలో సమస్యలు ఉన్న మాట నిజమే... సీఎం వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకు ఆయన అవసరమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను.' అని అమరీందర్ సింగ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నాయకత్వ మార్పు అంశం పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని... దాని గురించి తానేమీ చెప్పలేనని అన్నారు. వచ్చే ఎన్నికల వరకూ అమరీందరే సీఎంగా కొనసాగుతారని ధీమాగా చెప్పగలరా అని మీడియా ఆయన్ను ప్రశ్నించింది. 'ఇప్పుడు ఆయనే కదా సీఎం...' అంటూ రావత్ బదులిచ్చారు.

పంజాబ్‌లో ఏం జరగబోతుంది...
హరీశ్ రావత్‌ను కలిసినవారిలో పంజాబ్ మంత్రులు త్రిప్త్ రజీందర్,సింగ్ భజ్వా,సుఖ్‌జిందర్ సింగ్ రంద్వా,చరణ్‌జిత్ సింగ్ చన్ని,సుఖ్‌బిందర్ సర్కారియా ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు బరీందర్‌మీత్ పహ్దా,కుల్‌బీర్ జిరా,సుర్జిత్ ధిమన్ ఉన్నారు. మంగళవారం(ఆగస్టు 23) ఎమ్మెల్యే భజ్వా ఇంట్లో కాంగ్రెస్ రెబల్ నేతలు సమావేశమై అమరీందర్ సింగ్ తొలగింపుపై చర్చించారు. ఓవైపు రెబల్ నేతలు అమరీందర్ తొలగింపుకు పట్టుబడుతుండటం... పార్టీ అధిష్ఠానం మాత్రం అది కుదరదని పదేపదే చెబుతుండటం... చివరకు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే చర్చ జరుగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లో కుర్చీ కొట్లాట...
ఇక ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు అలజడి రేపుతున్నాయి. ఇక్కడ సీఎం కుర్చీ కోసం ప్రస్తుత సీఎం భూపేష్ బాఘల్,సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో మధ్య వివాదం నడుస్తోంది. 2018లో భూపేష్ భాఘల్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సమయంలో... చెరో రెండున్నరేళ్లు సీఎం కుర్చీలో కూర్చొనేందుకు తనకు హామీ ఇచ్చారని టీఎస్ సింగ్ వర్గం చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవట్లేదని ఆరోపిస్తోంది. ఈ పంచాయితీ ఇప్పుడు ఢిల్లీ పెద్దల వద్దకు చేరింది. భూపేష్ బాఘల్,టీఎస్ సింగ్ డియో ఇద్దరూ బుధవారం(ఆగస్టు 24) ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సీఎంగా తనను మారిస్తే రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని భూపేష్ బాఘల్ రాహుల్‌తో చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి ఛత్తీస్‌గఢ్ చేరుకున్నాక... ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది,ప్రస్తుత పరిస్థితుల గురించి అధిష్ఠానానికి వివరించినట్లు చెప్పారు. తనకేమీ పదవీ వ్యామోహం లేదని... ఒకవేళ అధిష్ఠానం ఆదేశిస్తే తప్పుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. అదే సమయంలో సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్నవారు... ఆ విషయంలో సక్సె కాలేరని టీఎస్ సింగ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

భూపేష్‌కు ఆ ఎమ్మెల్యేల మద్దతు...
భూపేష్ సింగ్ బాఘల్ ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో... దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికారు.వీరిలో మంత్రులు రవీంద్ర చౌబే,అమరజీత్ భగత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భూపేష్ సింగ్ బాదల్‌కు జై కొడుతూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలంతా బాఘల్ వెంటే ఉన్నారని నినదించారు. అనంతరం మరో 25 మంది ఎమ్మెల్యే భూపేష్ సింగ్ బాఘల్‌ను ఆయన నివాసంలో కలిశారు. సమావేశానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు.బాఘల్‌కు మద్దతు ప్రకటిస్తూ రాయ్‌పూర్‌లోని కొన్నిచోట్ల పోస్టర్లు సైతం వెలిశాయి.
Recommended Video

ఇద్దరికీ ఎక్కడ చెడింది...
ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బాఘల్‌పై తిరుగుబాటు చేస్తున్న టీఎస్ సింగ్ డియో ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో నెల రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే బృహస్పత్ సింగ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ దాడి వెనక ఉన్నది టీఎస్ సింగే అని బృహస్పత్ సింగ్ ఆరోపించారు. ఓ సందర్భంలో తాను ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించానని... అది నచ్చకనే టీఎస్ సింగ్ ఈ దాడికి ఉసిగొల్పారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో అసెంబ్లీ సమావేశాల నుంచి సింగ్ డియో వాకౌట్ చేశారు. అప్పటినుంచి సీఎం భూపేష్ బాఘల్,సింగ్ డియో మధ్య వివాదం మరింత ముదిరింది.












Click it and Unblock the Notifications