PUNJAB ELECTIONS 2022: రేపు నడ్డాతో అమరీందర్ భేటీ : పొత్తు పై క్లారిటీ - ముందుకొచ్చిన ధిండ్సా..!!
కొద్ది నెలల్లో జరగనున్న పంజాబ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసి..పార్టీ వీడి..కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పొత్తుల ఖరారు దిశగా అడుగులు వేస్తున్నారు. వివాదాస్పదంగా మారిన రైతు చట్టాలను కేంద్రం ఉప సంహరించుకోవటంతో.. బీజేపీతో పొత్తు అవిషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవని కెప్టెన్ స్పష్టం చేసారు. అందులో భాగంగా..డిసెంబర్ 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.

నడ్డాతో సమావేశంలో స్పష్టత
ఈ సమావేశంలో పంజాబ్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు పైన స్పష్టత... పోటీ చేసే స్థానాలు వంటి అంశాలు చర్చకు వస్తాయని వెల్లడించారు. ఇదే సమయంలో ఈ రెండు పార్టీలతో కలిసి పంజాబ్ ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీకి నాయకత్వం వహిస్తున్నరాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా స్పష్టత ఇచ్చారు. తమ పార్టీ కాంగ్రెస్..శిరోమణి అకాలీదళ్ తో కాకుండా ఏ ఇతర పార్టీతో అయినా పొత్తుకు సిద్దమని తేల్చి చెప్పారు. కెప్టెన్ అమరీందర్ పార్టీ, బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపైన చర్చలు జరుగుతున్నాయన్నారు.

పొత్తుల్లో ఎవరు ఎవరితో కలుస్తారు
రెండు ..మూడు రోజుల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని..అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు అమరీందర్ తో పొత్తు అంశం పైన ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. అయితే, తమకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ గా ఉన్నాయని వివరించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్..ఆప్..శిరోమణి అకాలీదళ్ ను ఓడించేందుకు తాము బీజేపీతో పాటుగా శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) తో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉన్నామంటూ అమరీందర్ చేసిన ప్రకటన తరువాత ధిండా ఈ వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ ఓటమే కెప్టెన్ లక్ష్యంగా
ఇటీవలే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ను కలిసిన కెప్టెన్ అమరీందర్ సింగ్, ఇది మర్యాదపూర్వక భేటీ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఆందోళనపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నుండి వైదొలిగిన తర్వాత, కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఇది భారత ఎన్నికల సంఘం నుండి క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చన్నీ కీలక వ్యాఖ్యలు చేసారు.

బహుముఖ పోటీ కలిసొచ్చేదెవరికి
"కెప్టెన్ మరియు బాదల్ కుటుంబం" తమ వ్యక్తిగత లక్ష్యాల కోసం ..పంజాబ్‌ను నాశనం చేసినందుకు కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపిందని ఆరోపించారు. "మొదట, బాదల్స్ రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలను అమలు చేశారు మరియు తరువాత దేశం మొత్తం మీద అదే విధంగా అమలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు... వారు ఈ నల్ల చట్టాలకు మద్దతుగా ప్రచారం చేశారని విమర్శించారు. హర్‌సిమ్రత్ తనంతట తానుగా రాజీనామా చేయలేదని.. ప్రజల్లో ఉన్న కోపం ఆమెతో రాజీనామా చేయించిందని మోగాలో జరిగిన ర్యాలీలో సీఎం వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో సరిహద్దు భద్రతా దళం అధికార పరిధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ, బీజేపీ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకోవడం ద్వారా కెప్టెన్ అమరీందర్ పంజాబ్‌ను, రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications