తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ మరో బిడ్డకు తండ్రి అయ్యారు. ఆయన రెండో భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్(34) గురువారం ఆడ శిశువుకు జన్మనిచ్చారు. తాను తండ్రినయ్యాననే విషయాన్ని మాన్ స్వయంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్ కౌర్‌కు ప్రసవం జరిగింది.
కాగా, పంజాబ్ సీఎం హోదాలో ఉండగా తండ్రి అయిన తొలి నాయకుడిగా 51 ఏళ్ల భగవంత్ మాన్ నిలిచారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను రెండేళ్ల క్రితమే మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. భగవంత్ మాన్ 2016 సంవత్సరంలో తన మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. వారు కెనడాలో స్థిరపడ్డారు.

ఈ క్రమంలో 2022 మార్చిలో పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు భగవంత్ మాన్. ఈ కార్యక్రమానికి మొదటి భార్య పిల్లలు కూడా హాజరయ్యారు. 2022 జూలై 7న గురుప్రీత్ కౌర్‌ను మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. కురుక్షేత్ర జిల్లా పెహోవా పట్టణానికి చెందిన గురుప్రీత్ ఒక డాక్టర్. ఆమె తండ్రి ఇంద్రజిత్ సింగ్ ఒక రైతు, ఆమె తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి.
Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb
— Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024
భగవంత్ మాన్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారం, క్రీడలు, రాజకీయ అంశాలపై కామెడీ ప్రోగ్రామ్స్ చేసేవారు. 2008లో గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లోనూ ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భగవంత్ మాన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా నిర్ణయించడంతో పంజాబ్ సీఎం పదవిని చేపట్టారు.












Click it and Unblock the Notifications