ట్యాక్స్ భారీగా పెంపు- భగ్గుమంటోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర ప్రస్తుతానికి భారీగా తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 75.04 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ రేట్ ఇంకా తక్కువగా నమోదైంది. 70.37 డాలర్ల వద్ద ట్రేడింగ్ రికార్డయింది. శనివారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధరలో స్థిరత్వం కనిపించింది. దాదాపు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి.
క్రూడాయిల్ ధరలో స్థిరత్వం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చమురు కంపెనీలు కొద్దిరోజులుగా వాటి రేట్లను పెంచట్లేదు. అలాగని తగ్గించనూ లేదు. సాధారణంగా క్రూడ్ రేట్ భారీగా పెరిగిన ప్రతీసారీ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం సాధారణమే అయినప్పటికీ- ఇప్పుడు 70 డాలర్లకు పడిపోయినా వాటి రేట్లను మాత్రం తగ్గించట్లేదు.

ఈ పరిస్థితుల్లో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంధన అమ్మకాలపై విలువ ఆధారిత పన్నును పెంచింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రస్తుతం వసూలుచేస్తోన్న వ్యాట్‌ను 10 శాతం మేర పెంచతున్నట్లు వెల్లడించింది ఈ మేరకు పంజాబ్ ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ ఫైనాన్షియల్ కమిషనర్ వికాస్ ప్రతాప్ నోటిఫికేషన్ జారీ చేశారు.
డీజిల్‌పై 12 శాతం లేదా లీటర్ ఒక్కింటికి రూ. 10.02 పైసలు, పెట్రోల్‌పై లీటర్ ఒక్కింటికి రూ. 15.74 పైసలు లేదా 14.32 శాతం పెంచుతున్నట్లు వికాస్ ప్రతాప్ తెలిపారు. ఈ దెబ్బకు చండీగఢ్‌లో పెట్రోల్ కంటే డీజిల్ రేటు పెరిగింది. పెట్రోల్ లీటర్ రూ. 98.20 పైసలు, డీజిల్ రూ.105.24 పైసలకు చేరింది. ఇదివరకు పెట్రోల్ రేటు రూ.96.20 పైసలు, డీజిల్ రూ.84.26 పైసలు ఉండేది. ఇప్పుడు డీజిల్ ఏకంగా 100 రూపాయల మార్క్‌ను దాటేసింది. లీటర్ ఒక్కింటికి రూ.105.24 పైసలకు చేరింది.
ఈ స్థాయిలో వ్యాట్‌ను పెంచడం వల్ల ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 600 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్థాయిలో వాహనదారులపై భారం మోపడం వల్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సామాన్యుడి వీపు మోత మోగిస్తోందంటూ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ధ్వజమెత్తుతున్నాయి. ఆందోళనకు దిగుతున్నాయి.












Click it and Unblock the Notifications