
కాంగ్రెస్‌లో ఫస్ట్ వికెట్ డౌన్: పార్టీని గెలిపించలేని ప్రతి పీసీసీ అధ్యక్షుడి మీదా..!
చండీగఢ్: మొన్నటి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు- కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ కొట్టాయి. సమీప భవిష్యత్‌లో కోలుకోనివ్వకుండా చేశాయి. పార్టీ మొత్తాన్నీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల పోరుటో కాంగ్రెస్ పార్టీ కనీస స్థాయిలో కూడా ప్రతిఘటించలేకపోయింది. ప్రత్యర్థిని ఢీ కొట్టలేకపోయింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ల మాట అటుంచితే- అధికారంలో ఉన్న పంజాబ్‌ను సైతం నిలబెట్టుకోలేకపోయింది.
అధికార పార్టీగా ఉంటూ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను మట్టి కరిపించిందీ పార్టీ. 117 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 92 స్థానాలపై జెండా పాతింది. కాంగ్రెస్-18 సీట్లకే పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్, బీజేపీ అడ్రస్ గల్లంతయింది. ఈ రెండు పార్టీలకు దక్కిన స్థానాలు అయిదు మాత్రమే. నాలుగు రాష్ట్రాల్లో కనిపించిన బీజేపీ ప్రభంజనం ఇక్కడ మాత్రం నామమాత్రంగా కూడా కనిపించలేదు.

దీనితో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ- ఈ అయిదు రాష్ట్రాల్లో పార్టీని ప్రక్షాళన చేయడానికి పూనుకుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను పదవుల నుంచి తప్పించింది. వెంటనే రాజీనామాలు చేయాలంటూ ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా పత్రాన్ని సోనియా గాంధీకి పంపించారు. ఏక వ్యాక్యంతో రాజీనామా చేశారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా.. అంటూ ఏకవాక్యంలో ముగించారు. ఇక మిగిలిన రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఇవ్వాళే తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. కాగా- ఈ అయిదు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ఇక మొదలైనట్టే. ఆయా రాష్ట్రాల పీసీసీల్లో వేర్వేరు హోదాల్లో ఉన్న నాయకులందరినీ తప్పించే అవకాశాలు లేకపోలేదు.
కాగా- ఇదే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక మున్ముందు కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. పార్టీని గెలిపించలేని ప్రతి పీసీసీ అధ్యక్షుడి మీదా వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరమే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒకింత బలంగా ఉంది. ఇదివరకు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది కూడా. గుజరాత్‌లో కూడా అధికారంలోకి రావాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది.