ఎంత పని చేశార్రా.. "రేబిస్" సోకిన ఆవు పాలతో ఆలయంలో ప్రసాదం !
ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో రేబిస్ కలకలం గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల రేబిస్ సోకిన ఆవు పాలతో తయారుచేసిన 'పంచామృతం' ప్రసాదాన్ని సేవించిన సుమారు 200 మంది గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన ఉరువా బ్లాక్ పరిధిలోని రాందిహ్ గ్రామంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
కాగా రెండు రోజుల క్రితం రేబిస్‌తో ఒక ఆవు చనిపోయింది. ఈ విషయం తెలియని గ్రామస్తులు.. ఆ వ్యాధి సోకిన ఆవు పాలను ఉపయోగించి పంచామృతం తయారుచేసి స్వీకరించారు. ఆ తర్వాత ఆవు మరణానికి కారణం గుర్తించిన వైద్యాధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు తక్షణమే యాంటీ-రేబిస్ టీకాలు వేయించుకోవాలని సూచించారు.

సుశీల్ గౌర్ అనే ఆవు యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. మూడు నెలల క్రితం ఆ ఆవును ఒక వీధి కుక్క కరిచిందని తెలిపారు. ఆ సమయంలో టీకాలు వేయించినప్పటికీ.. నిరంతర చికిత్స అవసరమన్న విషయం తెలియదని అన్నారు. ఆవు చనిపోవడానికి ముందే రేబిస్ నిర్ధారణ అయిందని వెల్లడించారు. పశువైద్యులు కూడా ఆవు రేబిస్ వ్యాధితోనే మరణించినట్లు ధృవీకరించారు.
ఇప్పటివరకు 170 మందికి పైగా గ్రామస్తులు రేబిస్ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన వైద్యారోగ్య శాఖ అధికారులు, పంచామృతం స్వీకరించిన వారందరికీ మూడు డోస్‌ల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని తెలిపారు.
అయితే మొదటి డోస్ తీసుకున్న మూడు రోజుల తర్వాత రెండో డోస్.. ఏడవ రోజున చివరి డోస్ ఇవ్వబడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో రేబిస్ నివారణ చర్యలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications