గాయపడ్డ సింహంలా రాఘవ్ చద్దా.. ఆప్ ఆరోపణల వెనుక భారీ కుట్ర?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తనపై చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను తొలగించిన తర్వాత ఆప్ నేతలు చేసిన విమర్శలను రాఘవ్ చద్దా కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన వీడియోలో.."నేను గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకారిని (ఘాయల్ హూ, ఇస్లియే ఘాతక్ హూ)" అంటూ ఇటీవల విడుదలైన 'ధురంధర్ 2' సినిమా డైలాగ్‌తో పార్టీకి రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఆ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు
తనపై ఆప్ చేస్తున్న ఆరోపణలన్నీ కుట్రపూరితమని రాఘవ్ చద్దా మండిపడ్డారు. ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు తాను సభలోనే కూర్చుంటున్నానన్న ఆరోపణను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్లమెంటులో ప్రతిచోటా సీసీటీవీ కెమెరాలు ఉంటాయని, తాను వాకౌట్ చేయని ఒక్క సందర్భాన్ని చూపించినా సరేనని సవాల్ విసిరారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం కాదు కాబట్టే, తాను వాస్తవాలను బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

సంతకాల వివాదంపై క్లారిటీ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిశంసన తీర్మానంపై సంతకం చేయడానికి నిరాకరించానన్న వార్తల్లో నిజం లేదని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. అసలు ఆప్ నుంచి ఏ నాయకుడు కూడా తనను ఈ తీర్మానంపై సంతకం చేయమని అడగలేదని ఆయన వెల్లడించారు. పైగా ఆప్ ఉన్న 10 మంది ఎంపీల్లో 6 లేదా 7 మంది దానిపై సంతకాలు చేయలేదని, కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం 50 మంది సంతకాలు ఉంటే సరిపోయే దానికి తనను బాధ్యుడిని చేయడం విడ్డూరమని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
मैं बोलना नहीं चाहता था, मगर चुप रहता तो बार-बार दोहराया गया झूठ भी सच लगने लगता।
— Raghav Chadha (@raghav_chadha) April 4, 2026
Three Allegations. Zero Truth.
My Response: pic.twitter.com/tPdjp04TLt
ప్రజా సమస్యలే నా ప్రాధాన్యత
తాను పార్లమెంటుకు వెళ్లింది అరుపులు, కేకలు వేయడానికి లేదా మైకులు విరగ్గొట్టడానికి కాదని, ప్రజా గొంతుకగా నిలవడానికని రాఘవ్ చద్దా గుర్తు చేశారు. గత నాలుగేళ్లలో తాను జీఎస్టీ, ఆదాయపు పన్ను, పంజాబ్ నీటి సమస్య, ఢిల్లీ వాయు కాలుష్యం, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు వంటి అనేక కీలక అంశాలను లేవనెత్తానని వివరించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని రుతుక్రమ ఆరోగ్యంపై కూడా తాను సభలో చర్చించానని ఆయన పేర్కొన్నారు.
నిజం త్వరలోనే బయటపడుతుంది..
పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడిచే పార్లమెంటులో తాను అర్ధవంతమైన చర్చలు జరపడానికి ప్రయత్నించానని, హంగామా చేయడానికి కాదని రాఘవ్ చద్దా అన్నారు. తన ట్రాక్ రికార్డును ఎవరైనా తనిఖీ చేసుకోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చివరగా తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టనని, ప్రతి అబద్ధాన్ని బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. "నేను గాయపడ్డాను, అందుకే అత్యంత ప్రమాదకారిగా మారాను" అంటూ తన పోరాటం కొనసాగుతుందని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications